సాక్షి నెట్‌వర్క్: వేర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించలేని ఆ పార్టీ నేతల నిర్వాకంపై సమైక్యవాదులు మండిపడ్డారు. బుధవారం సీమాంధ్ర జిల్లాల్లోని పలువురి కాంగ్రెస్ నేతల, మంత్రుల, ఎంపీల ఇళ్లను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటివద్ద లేకపోవడంతో ఇంటిగోడకు డిమాండ్ లేఖను, గులాబీ పువ్వును అంటించారు. అక్కడి నుంచి ర్యాలీగా అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల ఇళ్లకు వెళ్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వారు కూడా ఆ సమయంలో ఇళ్ల వద్ద లేకపోవడంతో, రాజీనామా చేయండి అంటూ రాసిన లేఖను గులాబీలతో ఇంటి ముందు ఉంచి వెనుదిరిగారు. కాకినాడలో ప్రభుత్వవాహన డ్రైవర్ల సంఘం సభ్యులు కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించి గంటపాటు డప్పులు వాయిస్తూ నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని ఇంటివద్ద సమైక్యవాదులు ధర్నా నిర్వహించారు. నరసాపురంలో ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడి నివాసాన్ని ముట్టడించారు. విజయనగరంలో బొత్స ఇంటి ముట్టడిలో స్వల్పఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోగా, న్యాయవాదులు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ నేతల ఇళ్లముట్టడి
Published Thu, Sep 5 2013 4:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement