తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎంపీ తలారి రంగయ్య
అనంతపురం, బ్రహ్మసముద్రం/కళ్యాణదుర్గం రూరల్: ‘‘ఇదేమన్నా కార్యాలయమా...? లేక పశువుల పాకా.. ఇంత అధ్వానంగా ఉన్నా పట్టిచుకోరా..? మీ కార్యాలయ ఆవరణే ఇలా ఉంచుకున్నారంటే.. మీరు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థమవుతోంది’’ అంటూ ఎంపీ తలారి రంగయ్య బ్రహ్మసముద్రం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గంలలో పర్యటించారు. తొలుతబ్రహ్మసముద్రం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల వెళ్లారు. ఎంపీడీఓ కార్యాలయ అధికారులు ఉదయం 10.30 గంటలు దాటినా విధులకు రాకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.
సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా, రేషన్‌కార్డుల గురించి తహసీల్దార్ రమేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులపై ఆరా తీశారు. వేతనాలు చెల్లించాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికుల మాట్లాడారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కళ్యాణదుర్గం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో మండిపడ్డాడు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు చోట్ల ఎంపీడీఓలు విధులకు గైరహాజరయ్యారని, ఇలా అయితే ప్రభుత్వ పథకాలు పేదలకు ఎలా అందుతాయని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు తిరిగి వస్తున్న కూలీలకు ఉపాధి హామీ పనులు విరివిగా కల్పించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment