
సాక్షి, మండపేట(పశ్చిమ గోదావరి) : జిల్లా, మండల పరిషత్తులు ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి రానున్నాయి. ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం, 4వ తేదీతో జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్నాయి. జిల్లాలో 1,102 మంది ఎంపీటీసీ సభ్యులు, 63 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జిల్లాలోని ఎటపాక, చింతూరు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో అవి మినహా మిగిలిన మండలాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 3న ముగియనుంది. పరిషత్తులకు ఎన్నికలు జరిగి, కొత్త పాలక వర్గాలు ఏర్పడేంత వరకూ జిల్లా, మండల పరిషత్తులు ప్రత్యేక పాలనలో ఉండనున్నాయి. గతంలో మాదిరిగా జిల్లా పరిషత్తుకు కలెక్టర్‌ను, మండల పరిషత్తులకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికారులు అంటున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ నుంచి సీఎం కార్యాలయానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి.
ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు
రెండు రోజుల్లో జిల్లా, మండల పరిషత్తుల పదవీ కాలం ముగియనుండగా ‘పరిషత్ పోరు’కు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) వారీగా జూలై 3వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను ఎంపీడీఓ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈఓ సిద్ధం చేయాలని సూచించింది. ఇప్పటికే పంచాయతీల్లో ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఓటర్ల ఫొటోలు, డోర్ నంబర్లతో అధికారులు జాబితాలను సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీ పరిధి మేరకు అధికారులు జాబితాలను రూపొందిస్తున్నారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీన వీటిని అందుబాటులో ఉంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment