కేసీఆర్‌ చేసిన పని.. బాబు ఎందుకు చేయలేదు | MSP Lower Than Suggested By State : MVS Nagi Reddy | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 12:52 PM | Last Updated on Fri, Jul 6 2018 6:40 PM

MSP Lower Than Suggested By State : MVS Nagi Reddy - Sakshi

సాక్షి, విజయవాడ : మద్దతు ధర ప్రకటనలో రైతుకు అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు నాయుడు రైతుల కోసం స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మద్దతు ధరల విషయంలో రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్న బీజేపీ నేతల మాటల్లో వాస్తవం లేదన్నారు. వరికి నామమాత్రంగా మద్దతు ధర పెరిగిందని విమర్శించారు.

ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో ముష్టివేసినట్లు ధరలు పెంచితే, చంద్రబాబు ఒక్కసారి కూడా నోరు మెదపలేదని నాగిరెడ్డి మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసిందని, కానీ చంద్రబాబు ఒక్కసారైనా రాశారా అని నిలదీశారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల ఏడాదని బీజేపీ ఇప్పుడు మద్దతు ధరలు పెంచి హడావిడి చేస్తోందని విమర్శించారు. ధాన్యానికి క్వింటాలుకి రూ. 2000 కనీసం ఉంటేనే రైతులు మనుగడ సాగిస్తారని తెలిపారు. సాగులో లేని పంటలకు ధర పెంచి అత్యధిక సాగు జరిగే పంటలకు మాత్రం నామమాత్రంగా పెంచారని విమర్శించారు.

మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మోడీ చంద్రబాబు ఎవరైనా సరే వారిని వెంటనే ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేయొద్దని, పెంచిన మద్దతు ధరలకు అనుగుణంగా యంత్రాంగాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయంపై రైతు నాయకుడిగా తాను సీఎంతో చర్చకు సిద్ధమని అన్నారు. రైతులకు వైఎస్సార్‌ అందించిన సేవలను రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదన్నారు. ఉచిత విద్యుత్‌ నుంచి మొదలు పెడితే రుణమాఫీ, మద్దతు ధరల వరకూ రైతు బాంధువుడిగా నిలిచారని నాగిరెడ్డి గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement