గతమెంతో ఘనమైంది: గవర్నర్
చరిత్ర నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది పుస్తకావిష్కరణ సభలో గవర్నర్ ఉద్ఘాటన
హైదరాబాద్: చరిత్ర అంటే కేవ లం రాజకీయ సంఘటనల పరిణామ క్రమం మాత్రమే కాదని, ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవితంలోని వైవి ధ్యాల సమగ్ర ఆవిష్కరణే చరిత్ర అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. జనజీవనంలోని ప్రతి అంశం చరిత్ర రచనలో నిక్షిప్తం కావాలన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి’ (మలియుగ ఆంధ్రప్రదేశ్ క్రీస్తు శకం 1324-1724) ఆంగ్ల గ్రంథం ఐదో సంపుటి ఆవిష్కణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘సాధారణంగా ప్రతి ఒక్కరూ రేపటి గురించే ఆలోచిస్తారు. చాలా మంది గతాన్ని గురించి పట్టించుకోరు. చాలా మందికి తమ తాతముత్తాల చరిత్రే తెలిసి ఉండకపోవచ్చు. అలాంటిది 1324 నుంచి 1724 వరకు 400 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్రను అద్భుతంగా గ్రంథస్తం చేసిన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సంస్థల కృషి అభినందనీయం’ అని ప్రశంసించారు.
గతమే చరిత్ర అని, దాని నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నుంచే ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధబాంధవ్యాలు పరిఢవిల్లాయన్నారు. రాష్ర్ట విభజనతో తెలుగు విశ్వవిద్యాల యం భవిష్యత్తులో అలాంటి కృషినే కొనసాగిస్తుందా, లేక ప్రపంచ తెలుగు ప్రజల కోసం మరో సంస్థ అవసరమా తేలాల్సి ఉందన్నారు. కార్యక్రమం లో విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, గవర్నర్ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎన్.రమేష్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బి.పాపారావు, ఏపీ చరిత్ర-సంస్కృతి సమగ్ర సంపుటాల సంపాదకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, ఐదో సంపుటి సంపాదకులు ఆచార్య ఆర్.సోమారెడ్డి పాల్గొన్నారు.