
కాపులు బాబుకు బుద్ధి చెప్పాలి: ముద్రగడ
‘రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం ఆఖరి దశకు చేరుకుంది.. చావో రేవో తేల్చుకుందాం.. ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని కోరుతుంటే అణగదొక్కేందుకు చూస్తున్నారు.
జగ్గంపేట/కిర్లంపూడి (జగ్గంపేట): ‘రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం ఆఖరి దశకు చేరుకుంది.. చావో రేవో తేల్చుకుందాం.. ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని కోరుతుంటే అణగదొక్కేందుకు చూస్తున్నారు.. తాటాకు మంటలా కాకుండా తుమ్మ కర్రలా ఉద్యమ సెగ సీఎం కుర్చీకి తగలాలి.. ఆ సెగకు కుర్చీలో కూర్చోలేక ఇదేంటి కాపు గోల అంటూ ఉక్కిరిబిక్కిరవుతూ ఇచ్చిన హామీ గుర్తుకు రావాలి.. నంద్యాల అసెంబ్లీ, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపులు తమ సత్తా చాటి చంద్రబాబుకు బుద్ధి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో గురువారం 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు 300 మంది సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రిజర్వేషన్ల సాధన దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.