రంగం సిద్ధం చేసిన పోలీసులు
నంద్యాలటౌన్: నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన ఆస్తి పన్నుల కుంభకోణం, రికార్డుల గది దగ్ధం, మినీట్స్ బుక్ అదృశ్యం కేసులను సీబీ సీఐడీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. మహా శివరాత్రి వేడుకలు పూర్తయ్యాక జిల్లా ఎస్పీ రవికృష్ణ ద్వారా వీటిని బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. గత ఏడాది జూలై 11న మున్సిపల్ కార్యాలయంలోని రికార్డుల గది అగ్ని ప్రమాదానికి గురైంది.
సిబ్బంది అవినీతి వెలుగులోకి రాకుండా నివారించడానికి గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల గదిని తగలబెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. అధికారులు ఒక చిరుద్యోగి సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో చేసిన తీర్మానాలకు సంబంధించిన కీలక మినీట్స్ బుక్ గత ఏడాది జూన్‌లో అదృశ్యమైంది. దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికీ మినీట్స్ బుక్ ఆచూకీ లేదు. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన ఆడిటింగ్‌లో రెవెన్యూ సెక్షన్‌లో ఆస్తి పన్నులకు సంబంధించి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై 13 మంది ఉద్యోగులను మున్సిపల్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఈ మేరకు అప్పటి కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మంది ఉద్యోగులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు. పోలీసులు కేసు విచారణ చేపడితే 300 మంది ఆస్తి పన్నుల యజమానులను విచారించాల్సి ఉంది. విచారణలో మరో 300 మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పనిభారం అధికంగా ఉన్నందున ఈ కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో వీటి విచారణ బాధ్యతలను సీబీ సీఐడీకి బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
మున్సిపల్ కేసులన్నీ సీబీ సీఐడీకి?
Published Sun, Feb 15 2015 3:22 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
Advertisement