ఎన్నికల నిఘా
ఏలూరు, న్యూస్‌లైన్ :మునిసిపల్ ఎన్నికలు, సాధారణ ఎన్నికల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లతో పాటు అభ్యర్థులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లను విలేకరులకు ఆయన వివరించారు. ఈనెల 7న పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటిస్తామన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ఈనెల 10న నోటిఫికేషన్ జారీ చేస్తామని, అదే రోజు నుంచి 13వ తేదీ వరకు ఏలూరు నగరపాలక సంస్థకు, మిగిలిన పురపాలక సంఘాలకు 14వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల
నుంచి సాయంత్రం 3 గంటల వరకు స్వీకరిస్తారన్నారు. ఈ నెల 15 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, మార్చి 18 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అనంతరం తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 30 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుందని, వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంద న్నారు.
వ్యయ పరిమితి..
కార్పొరేషన్‌లో డివిజన్ మెంబరుగా పోటీ చేసే అభ్యర్థికి రూ.లక్షా 50వేలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల వ్యయపరిమితి రూ.లక్ష ఉంటుందన్నారు. వాహనాల వినియోగం, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు.
బంధువుల వేడుకలపై కూడా నిఘా
పోటీ చేసే అభ్యర్థులు, వారి బంధువులు నిర్వహించే సామూహిక భోజనాలు, భారీ ఎత్తున నిర్వహించే పుట్టినరోజులు, వివాహాలు, సన్మానం, ఉత్సవాలపై కూడా నిఘా ఉంచుతామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల వ్యయాన్ని నిర్దిష్టమైన పుస్తకంలో నమోదు చేసి, ఎన్నికల అనంతరం నిర్ణీత గడువులోగా సమర్పించాలన్నారు. గోడలపై రాతలు, పోస్టర్లు అంటించటం తదితరాల ప్రచారానికి ఆ భవన యజమానుల అనుమతి పొందాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఎన్నికల ఖర్చు అధికంగా ఉంటుందని భావించే డివిజన్లు, వార్డుల్లో ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
విద్యార్థుల ప్రశాంతతకు భంగం కలిగించవద్దు
ఈ నెలాఖరు నుంచి 10వ తరగతి పరీక్ష లు జరగనన్న దృష్ట్యా విద్యార్థుల చదువుకు భంగం కలిగించని రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. లౌడ్ స్పీకర్లతో విద్యార్థులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు.
ఎన్నికల వ్యయ ప్రభావిత జిల్లాగా పశ్చిమ
జిల్లాలోని 15 నియోజకవర్గాలను అధిక ఎన్నికల వ్యయ ప్రభావం ఉండే ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిందని కలె క్టర్ తెలిపారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు అధికంగా ఎన్నికల ఖర్చు చేసే ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిందని, అయితే జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు అధిక ఎన్నికల వ్యయప్రభావం ఉండే ప్రాంతాలుగా పేర్కొందన్నారు. చట్టవిరుద్ధంగా ఎన్నికల ఖర్చు చేసే అవకాశం ఉన్నందున వ్యయ నియంత్రణకు అన్ని స్థాయిల్లో షాడో నిఘా ఉంచుతామన్నారు.
ఎన్నికల వ్యయానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా
అభ్యర్థులు నామినేషన్ సమర్పించే నాటికి ఎన్నికల వ్యయానికిగాను వేరేగా బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని, ఆ ఖాతా ద్వారా ఎన్నికలకు సంబంధించిన చెల్లింపులను చెక్కుల ద్వారా చేయటం ఉత్తమమన్నారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో భాగంగా రిటర్నింగ్ అధికారులే కాకుండా, కస్టమ్స్, ఆదాయపు పన్ను, ఆడిట్, వాణిజ్య పన్నుల అధికారులు బృందాలుగా ఏర్పడి బ్యాంకులలో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవిలపై దృష్టి పెడతారని చెప్పారు. అటువంటి వాటిపై వివరణను ఆయా వ్యక్తులు వివరించాల్సి ఉంటుందన్నారు. ఒకే రోజున ఎక్కువ మొత్తం నగదు జమ, డ్రా చేయడంపై నిఘా ఉంటుందన్నారు. ఈ విషయంపై బ్యాంకర్లతో ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు.. రూ. 50 వేలకు మించి నగదు రవాణా చేసేటప్పుడు సంబంధిత వాణిజ్య, ఇతర లావాదేవీల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బృందాలు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మర్యాదపూర్వకంగా పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల వ్యయాన్ని పరిమితికి, చట్టానికి లోబడి ఖర్చు చేయాలే తప్ప, పరిమితికి మించితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నగదు, మద్యం, ఇతర తాయిలాల రూపంలో ఓటర్లను ప్రలోభపరిచే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయా అభ్యర్థులు, పార్టీల నుంచి బహుమతులు, నగదు వంటివి పుచ్చుకున్నా నేరమేనన్నారు.
సాధారణ ఎన్నికల షెడ్యూల్ ..
జిల్లాలో సాధారణ ఎన్నికలకు ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 19న నామినేషన్ల స్వీకరణకు తుది గడువని, 21న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువన్నారు. మే 7న ఎన్నికల నిర్వహిస్తారని, మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. జిల్లాలో 39 లక్షల 77వేల 727 మంది ప్రజలున్నారని, వీరిలో 28వేల 12 లక్షల 472 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. వీరిలో మహిళలు 14 లక్షల 24వేల 212 మంది ఉండగా, పురుషులు 13 లక్షల 88వేల 101 మంది ఉన్నారన్నారు. 2014 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో లక్షా 70వేల 645 మంది ఓటర్లుగా నమోదు కాగా, వారిలో 18-19 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు 44 వేల 470 మంది ఉన్నారన్నారు.
ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. 08812-230050 ఫోన్ , 08812-230052 ఫ్యాక్స్ ఉన్నాయని చెప్పారు.
వ్యయ నియంత్రణ పర్యవేక్షక బృందాలు
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి సహాయ వ్యయ పరిశీలకులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు, వీడియో వీక్షణ బృందాలు, ఎన్నికల వ్యయ అక్కౌంటింగ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గానికి 3 ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు, 5 ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలన బృందాలు, ఒక నోడల్ అధికారి, ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టొరల్ అధికారిని ఏర్పాటు చేశామన్నారు.
9నఓటర్ల నమోదు కార్యక్రమం
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని గట్టి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలో ఈ నెల 9 ఆదివారం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లుగా నమోదుకానివారు, ఇతర కారణాల వలన పేరు నమోదు చేసుకోలేని వారు ఆ రోజు బూత్ స్థాయి అధికారులకు ధరఖాస్తు సమర్పించవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో ఓటర్ల డూప్లికేషన్‌ను తొలగించేందుకు రీడూప్లికేట్ సాఫ్ట్‌వేర్ రానుందని తెలిపారు.