ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్న వారిపై మరోసారి తుపాకీ తూటా పేలింది.
పుల్లంపేట(ఓబులవారిపల్లె),న్యూస్‌లైన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్న వారిపై మరోసారి తుపాకీ తూటా పేలింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఉన్మాది ఈ సారి తోట సుబ్రమణ్యం(45) అనే వ్యక్తిని తన తూటాకు బలి తీసుకున్నాడు. గ్రామానికి చెందిన ఐదుగురిని లక్ష్యంగా చేసుకుని 2009లో ప్రారంభమైన హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఓబులవారిపల్లె మండలం గాదెల వెంకటాపురం (జీవీ పురం) గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పొలం పనులు చేసుకుంటున్న తోట సుబ్రమణ్యం (45) అనే వ్యక్తిపై పొదల మాటున దాక్కున్న వెంకటరమణ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో సుబ్రమణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుటుంబానికి దాయాదులు అన్యాయం చేశారనే కసితో ఉన్మాది వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 2009 జూన్30వ తేదీన వెంకటరమణ, 2012 జూన్ 29న బండి. రామకృష్ణయ్య అనే వ్యక్తులు హతమయ్యారు. ప్రస్తుతం తోట సుబ్రమణ్యం కూడా ఇదే రీతిలో తుపాకీకి బలికావడం గమనార్హం. తోట సుబ్రమణ్యంకు ప్రాణ హాని ఉందనే కారణంగా గతంలో పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఎస్కార్టు ఖర్చులు తాను భరించలేనని చెప్పడంతో పోలీసులు ఎస్కార్టును ఉపసంహరించారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు పక్కా సమాచారం, ప్రణాళికతో హత్యచే సి పారిపోయినట్లు స్పష్టమవుతోంది.
సంఘటన తెల్లవారుజామున జరిగితే ఉదయం 7 గంటల వరకు కూడా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ ఈ హత్య జరగడం పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. సంఘటన స్థలాన్ని రాజంపేట డీఎస్పీ అన్యోన్య, సీఐ రమాకాంత్, ఎస్‌ఐ మోహన్‌లు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య,ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా గ్రామానికి చెందిన గద్దె చిన్నవెంకటయ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్మాది హిట్ లిస్టులో ఉన్నట్లు సమాచారం.