తన తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మూర్తి పెద్ద కుమారుడు రామారావు
ఆరిలోవ/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/గోపాల పట్నం(విశాఖ పశ్చిమ): గీతం వర్సిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తికి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అధ్యాపకులు కన్నీటి నివాళి అర్పించారు. ఆయన నివాసం, టీడీపీ కార్యాలయం, గీతం వర్సిటీలో మూర్తి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ గురువు కడసారి చూపుల కోసం శిష్యులు తరలివచ్చారు. కాగా.. మూర్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివా రం జరిగాయి. గీతం విద్యా సంస్థల వెనుక భాగంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయ న పెద్ద కుమారుడు రామారావు శాస్త్రోక్తంగా మూర్తి చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు అక్కడ∙మూర్తి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా సిరిపురంలోని వాల్తేరు అప్‌ల్యాండ్‌లోని ఆయన నివాసానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబ సభ్యులు సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం మూర్తి మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించి కాసేపు అక్కడ ఉంచారు. పలువురు పార్టీ నాయకులు అంజలి ఘటించారు. అక్కడ నుంచి గీతం విద్యా సంస్థల వరకు అంతిమయాత్ర కొనసాగింది. వర్సిటీ ప్రధాన ద్వారం నుంచి లోపలకు తీసుకెళ్లి వెనుక ద్వారం నుంచి అంత్యక్రియలు నిర్వహించే స్థలానికి తరలించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నివాళులర్పించారు.
అంతిమయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు సీహెచ్ అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్, ఎంపీలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కె.హరిబాబు, మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యేలు బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాక మూర్తి పెద్ద కుమారుడు రామారావు తండ్రి చితికి నిప్పంటించారు. చిన్న కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె భారతి, కుటుంబసభ్యులు నివాళులర్పించారు.
కలెక్టర్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామాహేశ్వరరావు, కింజరపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరావు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత దగ్గుపాటి సురేష్, సినీ నటుడు తొట్టెంపూడి వేణు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు అనిత, వాసుపల్లి గణేష్‌కుమార్, పీలా గోవింద్, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొండ్రు మురళీ, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, వంశీకష్ణ శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, నాగిరెడ్డి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, జేసీ సృజన, పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, వుడా వీసీ బసంత్ కుమార్, ఏయూ వీసీ నాగేశ్వరరావు, సెంచూరియన్ వీసీ జీఎస్‌ఎన్ రాజు, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఈపీడీసీఎల్ సీఎండీ దొర, నందమూరి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు, ఎంఎస్ రామయ్య కన్‌స్ట్రక్షన్స్ ఎండీ మొగ్గా సీతారామయ్య, సీనియర్ నేత లాలంభాస్కరరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్‌కుమార్, పీసీసీ కార్యదర్శి సోడదాసు సుధాకర్ తదితరులు మూర్తికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మూర్తితో పాటు మరణించిన వీవీఎస్ చౌదరి మృతదేహాన్ని ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా జొన్నాడకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment