వారెవరు? | mystery of the death of a cow | Sakshi
Sakshi News home page

వారెవరు?

Published Sat, May 2 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

వారెవరు?

వారెవరు?

మిస్టరీగా గోవుల మృతి
 అర్ధరాత్రి గోశాలలోకి {పవేశించిన పదిమంది
బలవంతంగా ఆవులకు  పట్టిన ద్రావకమేంటి?
నిజాలు దాచేస్తున్నారా?
 ‘సాక్షి’ టీవీ ఎక్స్‌క్లూజివ్ వీడియోలో రహస్యాలు

 
మల్లికార్జునపేట గోశాలలో 17 ఆవుల మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా..? ఏప్రిల్ 28వ తేదీ అర్ధరాత్రి గోశాలలోకి గోడ దూకి ప్రవేశించిన గుర్తుతెలియని ఆ పదిమంది ఎవరు? వారంతా ఆవులకు పట్టిన ద్రావకం ఏమిటి? అవి తాగడం వల్లే ఆవులు మృతిచెందాయా? శుక్రవారం ‘సాక్షి’ టీవీకి మాత్రమే లభించిన గోశాల వీడియో పుటేజ్‌ను తిలకిస్తే ఈ అనుమానాలు రాకతప్పదు. బొంబాయి రవ్వ అధిక మోతాదులో తినడం వల్లే గోవులు చనిపోయాయని గోశాల నిర్వాహకులు, పశువైద్యులు పదేపదే చెబుతున్నా.. ఏదైనా విషాహారం తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా..? లేక గోవులకు నాటువైద్యం ఏమైనా చేశారా.. అనే ప్రశ్నలతో              గోమాతల మృతి మిస్టరీగా మారింది.    - సాక్షి, విజయవాడ
 
 ఆ పదిమంది ఎవరు?

 ఏప్రిల్ 28వ తేదీ రాత్రి 9 గంటలకు అర్జునవీధిలో నుంచి దాదాపు పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు గోడ దూకి గోశాలలోకి ప్రవేశించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే ఉన్నట్టు వీడియో పుటేజ్ చూస్తే తెలుస్తోంది. ఈ పదిమంది వ్యక్తులు తమ వద్ద ఉన్న బాటిల్‌లోని ద్రావకాన్ని గోవులకు పట్టించినట్లు తెలుస్తోంది. వీరు గోశాలలోకి ప్రవేశించే సమయానికే కొన్ని ఆవులు నిద్రపోయాయి. వాటిని కూడా బలవంతంగా పైకిలేపి తాము తెచ్చిన పదార్థాన్ని పట్టిస్తున్నట్లు పుటేజ్‌లో రికార్డయింది. గోశాల ప్రయివేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. మేనేజర్ లావణ్య రాత్రి ఎనిమిది గంటలకు గోశాలకు తాళాలు వేయించి వెళ్లిపోతారు. ఆ తరువాత నిర్వాహకుల అనుమతి లేకుండా బయట వ్యక్తుల్ని అనుమతించరు. గోశాల తాళాలు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు సిబ్బంది వద్దే ఉంటాయి. 28వ తేదీ లావణ్య వెళ్లిపోయిన తరువాత గోశాలలోకి ఎవరూ రాలేదని గోశాల అధ్యక్షుడు రఘురాం, సిబ్బంది చెబుతున్నా వీడియో పుటేజ్‌లో పదిమంది వ్యక్తులు సంచరిస్తున్నట్లు కనిపిస్తోంది. అర్ధరాత్రి వేళ పదిమంది వ్యక్తులు గోడ దూకి లోపలకు ఎందుకు రావాల్సి వచ్చింది? వారు నిర్వాహకుల అనుమతి లేకుండా లోపలికి వస్తుంటే రాత్రి కాపలా ఉన్నవారు ఎందుకు ఊరుకున్నారు?  వారు తెచ్చిన ద్రావకం ఏంటి? దానిని గోవులకు తాగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
 
నాటు వైద్యం చేశారా?

బొంబాయి రవ్వ తిన్న గోవులు అనారోగ్యం పాలైతే వాటికి పశువైద్యులతో చికిత్స చేయించకుండా నిర్వాహకులే నాటు          వైద్యం చేయించారని ప్రచారం జరుగుతోంది. గోశాలలో రాత్రిపూట సంచరించిన వ్యక్తుల చేతుల్లో ఉన్న బాటిల్స్ వంటివే గోశాల కార్యాలయంలోనూ ఉన్నాయి. అయితే, అవి నువ్వుల నూనె బాటిల్స్. గోవులకు ఆ రాత్రి నువ్వుల నూనె పట్టించారనే అనుమానం వస్తోంది. బొంబాయి రవ్వ తిన్న గోవులకు గ్యాస్ రావడంతో దాన్ని తగ్గించేందుకే నాటువైద్యం కింద నువ్వుల నూనె పట్టిస్తే అది వికటించి ఆవులు చనిపోయాయా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.  నిర్వాహకుల అనుమతితో వారు గోశాలలోకి వస్తే గోడ ఎందుకు దూకాల్సి వచ్చిందనే అనుమానమూ లేకపోలేదు. 28వ తేదీ గోవులకు నాటు వైద్యం చేసినట్టు పోలీసుల విచారణలో నిర్వాహకులు వెల్లడించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయి. నిర్వాహకులు వాస్తవాలను దాచి బొంబాయి రవ్వ విషయమే చెప్పారని సమాచారం.
 
 అనధికారికంగా వచ్చి ఉంటారు

రోజూ రాత్రి 8 గంటలకు గోశాలకు తాళాలు వేసి వెళ్లిపోతాం. ఆ తరువాత నిర్వహకులకు ఏదైనా అవసరమైతే సమీపంలోనే ఉన్న వెంకటేశ్వరరావును పిలుస్తారు. 28వ తేదీ రాత్రి మేము తాళాలు వేసి వచ్చిన తరువాత గోశాలలోకి పదిమంది గోడ దూకి వచ్చినట్లు నాకు తెలియదు. నిర్వాహకుల అనుమతి లేకుండా రాత్రిపూట ఎవరినీ అనుమతించం. వారంతా అనధికారికంగానే వచ్చి ఉంటారు.    - లావణ్య, గోశాల మేనేజర్
 
 పొట్ట ఉబ్బరమైతే ఆయిల్ పట్టిస్తారు..

 నూకలు, రవ్వలు, వండిన ఆహారం వంటి వాటిని ఆవులకు పెట్టకూడదు. వీటివల్ల  కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి అయ్యి అవి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఆవుల పొట్టలో గ్యాస్ తగ్గించేందుకు ఒక్కోసారి నాటువైద్యంగా నువ్వుల నూనె తాగిస్తుంటారు.
 - వి.ప్రసాద్, అసిస్టెంట్ డెరైక్టర్, పశువైద్యశాల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement