
సాగర్ పనులు సాగదీత!
► కొలిక్కిరాని కాల్వల ఆధునికీకరణ
► రూ. కోట్ల నిధులు మట్టిపాలు
► నేటికీ ప్రారంభంకాని కాంక్రీట్ పనులు
ప్రపంచ బ్యాంక్ నిధుల ద్వారా చేపట్టిన నాగార్జున సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు ఎన్నాళ్లు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కెనాల్స్ మరమ్మతుల కోసం కేటాయించిన వందల కోట్ల రూపాయల నిధులు మట్టిపాలవుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. కాల్వల్లో పూడిక మట్టి తీసి దానినే కట్టలు సరిజేసేందుకు వినియోగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ మట్టి కట్టలు తిరిగి కాల్వలోకి పడిపోతున్నాయని చెబుతున్నారు. సక్రమంగా పనులు చేయకపోవడంతో చివరి భూములకు నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి కాల్వల ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆచరణలో ఆ విధంగా అయ్యేలా కనిపించడం లేదు.
క్రోసూరు : క్రోసూరు సబ్‌డివిజన్ పరిధిలోని సాగర్ కాల్వల ఆధునికీకరణకు రూ.53.99 కోట్ల పనులు మంజూరు చే శారు. 2008 లో చేపట్టిన పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల నిధులు వినియోగిస్తున్నా ఆ స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని రైతులంటున్నారు. ఏటా పొలాలకు నీరందక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తూతూ మంత్రంగా మట్టి పనులు చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ క్రోసూరు సబ్‌డివిజన్ పరిధిలో బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట మండలాలున్నాయి. వీటిలో బెల్లంకొండ డిస్ట్రిబ్యూటరీ నెంబర్ -7, క్రోసూరు డిస్ట్రిబ్యూటరీ నెంబర్ -8, అచ్చంపేట డిస్ట్రిబ్యూటరీ నెంబర్-9 గా ఉన్నవాటి కాలువపనులతో పాటు, తిరిగి వాటి కింద(వాటర్ యూజర్ సంఘాల) ఉపభాగాలు విభజించి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్‌యూజర్ సంఘం పనులు జరుగుతున్నాయని కెనాల్స్ డీఈ వీరయ్య తెలిపారు.
చేపట్టాల్సిన పనులు...
సబ్ డివిజన్ పరిధిలో కెనాల్స్ మట్టి పనులు, తూముల పటిష్టం, డ్రాపులు, వంతెనల నిర్మాణం, యూటీలు, సైఫన్లు, షెట్టర్లు, కాంక్రీటు పనులు చేపట్టాలి. కాల్వల్లో మట్టి తీసి దానినే తిరిగి కట్టల పటిష్టం పేరుతో అలంకరించారని వాపోతున్నారు. యర్రబాలెం మేజరు కింద 22 కిలోమీటర్లు, రాజుపాలెం కింద 13 కిలోమీటర్లు, చింతపల్లి మేజరు 15 కిలోమీటర్లు, కస్తలమైనర్ 25 కిలోమీటర్లు, చామర్రు 25 కిలోమీటర్లు పనులు నిర్వహించాలి.
ఇప్పటివరకు చేసిన పనులు ...
బెల్లంకొండ డీసీ కింద రూ. 16.99 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.11 కోట్ల మేర పనులు చేశారు. ఇంకా కాంక్రీటు పనులు పెండింగ్ ఉన్నాయి. క్రోసూరు డీసీ కింద రూ.8.8 కోట్లు పనులు చేయాల్సి ఉండగా రూ.7.8 కోట్ల వరకు చేశారు. చామర్రు డీసీ కింద రూ.6.8 కోట్లు మేర చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఈ మూడు డీసీల కింద రూ.32.59 కోట్లు విలువ చేసే పనులు చేయాల్సి ఉండగా రూ.18.8 కోట్ల వరకు చేశామని అధికారులు అంటున్నారు.
డీసీల కింద పనులు...
బెల్లంకొండ సంఘం కింద ఉన్నది 10 స్లైసెస్. దీనికి సంబంధించి చేయాల్సిన పనులు రూ. 15 కోట్ల అయితే రూ.10.6 కోట్లు మాత్రమే చేశారు. క్రోసూరు వాటర్ యూజర్ సంఘం కింద పనులు ప్రారంభం కాలేదు. చామర్రు వాటర్ యూజర్ సంఘం (5 స్లైయిసెస్) కింద రూ. 6.40 కోట్లకు రూ.4.60 కోట్ల పనులు మాత్రమే జరిగాయి.
మూడేళ్లుగా వేగంగా చేస్తున్నాం ...
2008 నుంచి 2012 వరకు ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగినప్పటికీ మూడేళ్లుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వర్షాకాలానికీ దాదాపుగా పూర్తిచేస్తాం. కొన్ని పనులుపెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం గడువు పెంచుతుందని భావిస్తున్నాం.
-కెనాల్స్ డీఈ, వీరయ్య.