
రైతుల ఆత్మహత్యలపై మౌనం దారుణం: నాగిరెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణ మని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ తీరుపై నాగిరెడ్డి ధ్వజం
చంద్రబాబు రైతు వ్యతిరేకి అనడానికి ఇదే నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణ మని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. వ్యవసాయరంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించలేక నిరాశా నిసృ్పహల తో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో 86 మంది ఆత్మహత్యలు చేసుకున్నా ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా.. వారి కుటుంబాల పట్ల సానుభూతిని చూపించక పోవడం శోచనీయమని అన్నారు. చంద్రబాబునాయుడు మరింత కరడుగట్టిన రైతు వ్యతిరేకిగా మారిపోయారనడానికి ఇదే నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా రుణమాఫీకి అర్హమైన రైతుల ఖాతాలు ఎన్నో వెల్లడించి, ఏ మేరకు రుణాలు మాఫీ అవుతాయో చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.