చెల్లని రూల్స్‌ | Nandyal by-election is today | Sakshi
Sakshi News home page

చెల్లని రూల్స్‌

Published Wed, Aug 23 2017 1:31 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

చెల్లని రూల్స్‌ - Sakshi

చెల్లని రూల్స్‌

నేడే నంద్యాల ఉప ఎన్నిక.. అక్రమాలపైనే అధికార పార్టీ దృష్టి
 
నంద్యాల నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మహాసంగ్రామానికి నాంది కాబోతున్న నంద్యాల ఉప  ఎన్నిక నేడే జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాగే పోలింగ్‌పై రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. విజయం ఖాయమైపోయిందని ఓవైపు, మెజారిటీ ఎంత అని మరోవైపు రాజకీయ నేతలు, ప్రజలు కూడా లెక్కల్లో మునిగితేలారు. ఇంకోవైపు పోలింగ్‌కు ఇక ఒక్కరోజే సమయం మిగిలి ఉండడంతో ఎలాగైనా నెగ్గాలన్న లక్ష్యంతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎన్నికల కోడ్‌ను అపహాస్యం చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో హల్‌చల్‌ చేశారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరిగింది.

మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తన ఇంట్లో పార్టీ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇస్తుండగా ఒక్కసారిగా భారీగా తరలివచ్చిన పోలీసులు సోదాలంటూ హల్‌చల్‌ చేశారు. ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా అడ్డుకునేందుకు చివరి వరకు అధికారపార్టీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
ప్రతిపక్ష ఏజెంట్లు ఉండొద్దా? 
నంద్యాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లోని సిబ్బందిని, పోలింగ్‌ ఏజెంట్లను బయటకు తరిమేశారు. అలాగే పేదలకు చౌక ధరలకే సరుకులు అందజేస్తున్న ‘శిల్పా సహకార్‌’ను బలవంతంగా మూసివేశారు. శిల్పా ఇంటి వద్ద మంగళవారం రాత్రి పోలీసులు భారీగా మోహరించారు. విధినిర్వహణలో ఉన్న పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకోవద్దని, ఎన్నికల ఏజెంట్లను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వారు లెక్కచేయలేదు. శిల్పా ఇంటివద్ద ఎవరూ ఉండవద్దంటూ హెచ్చరించారు.

పోలింగ్‌ బూత్‌ల ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అక్కడున్న ఏజెంట్లపై లాఠీలు ఝుళిపించారు. దీంతో శిల్పా ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను నియమించుకోకపోతే ఇక తమ అరాచకాలకు అడ్డే ఉండదని టీడీపీ నాయకత్వం భావిస్తోందని స్థానికులు మండిపడ్డారు. పోలీసుల తీరుపై శిల్పా మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకోవడాన్ని ప్రశ్నించారు. మరోవైపు శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి స్థానికేతరుడని, ఆయన నంద్యాల నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. 
 
ఆధారాలు లభించలేదు 
నంద్యాలలో పేదలకు ఆసరాగా ఉన్న ‘శిల్పా సహకార్‌’ సూపర్‌ మార్కెట్‌ను టీడీపీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు మూసివేశారు. శిల్పా సహకార్‌లో నిత్యావసర సరుకులను పేదలకు 10 శాతం రాయితీతో విక్రయిస్తున్నారు. ఇక్కడ సరుకులు ఉచితంగా ఇస్తున్నారంటూ తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌ జెట్టి, అదనపు ఎస్పీ రవిప్రకాశ్, రిటర్నింగ్‌ అధికారి ప్రసన్న వెంకటేష్, డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరు శిల్పా సహకార్‌ సూపర్‌ మార్కెట్‌లోకి వెళ్లి అక్కడ పంపిణీ చేస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు. రాత్రి 8 గంటలకు సంస్థను మూసివేశారు. కొందరు చేసిన ఫిర్యాదు మేరకే ఇక్కడ తనిఖీలు నిర్వహించామని, ఉచితంగా సరుకులు ఇస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్‌ చెప్పారు.  
 
బెదిరింపులకు భయపడం
నంద్యాల ఉప ఎన్నికలో ఎలాగైనా నెగ్గాలనే కుట్రతో అధికార పార్టీ నాయకులు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడబోమని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. మరికొన్ని గంటల్లో పోలింగ్‌ జరగాల్సి ఉండగా తన ఇంట్లో సోదాలు చేశారని, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, శిల్పా సహకార్‌ను మూసివేశారని మండిపడ్డారు. స్థానికేతరులైన మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలోనే మకాం వేసినా పట్టించుకోని పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నంద్యాలలోనే తిరుగుతూ డబ్బులు పంచుతున్నా పట్టించుకోని పోలీసులు తన ఇంట్లో మాత్రం సోదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకే ముగిసినా టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్‌ మంగళవారం కూడా నంద్యాలలో సమావేశం ఏర్పాటు చేసి, ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపించారు. 
 
ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వెంటే... 
ప్రతిపక్ష ఏజెంట్లు లేకుండానే పోలింగ్‌ను ఏకపక్షం చేసి, దౌర్జన్యంగా నెగ్గాలని అధికార పార్టీ కుట్ర పన్నుతోందని శిల్పా మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాలలో స్థానికుడేనని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చక్రపాణిరెడ్డి నంద్యాలను విడిచి వెళ్లాలంటూ పోలీసులు హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. పోలీసుల చర్యలను న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటామన్నారు.  
 
పోలీసులు పట్టించుకోవడంలేదు 
తమ సంస్థలను పోలీసులు టార్గెట్‌ చేశారని, మూసివేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని శిల్పా మోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్‌రెడ్డి ధ్వజమెత్తారు.   మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డితోపాటు 50 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాలలోనే ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.   కాగా, శిల్పా మోహన్‌రెడ్డి తన మామ కావడం వల్ల అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో 17 రోజులుగా ప్రతి రోజూ ఒక పరిశీలకుడిని శిల్పా సహకార్‌లో ఉంచారని శిల్పా సేవా సమితి చైర్మన్‌ శిల్పా నాగినిరెడ్డి చెప్పారు. ఇక్కడ ఎవరికీ ఉచితంగా సరుకులు ఇవ్వడం లేదని, పేదలకు 10 శాతం సబ్సిడీతో ఇస్తున్నామని తెలిపారు. 
 
నంద్యాలలో మంత్రుల హల్‌చల్‌ 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉప ఎన్నికల నేపథ్యంలో నెల రోజులకు పైగా నంద్యాలలో తిష్టవేసి మంత్రాంగం నడిపిన మంత్రులు.. ప్రచారం గడువు ముగిసి 24 గంటలైనా పట్టణం వీడటం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర జిల్లాలవారు సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత జిల్లాలో ఎక్కడా ఉండేందుకు వీలులేదు. నంద్యాల ఓటర్లు మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాల వారు సైతం నంద్యాలలో మకాం వేయకూడదని ఈసీ స్పష్టంగా పేర్కొంది.

అయితే, మొదటి నుంచి నంద్యాల ఉప ఎన్నికలను పర్యవేక్షించిన మంత్రులు ఇతర జిల్లాల వారు కావడంతో వారు తప్పకుండా సోమవారం ఐదు గంటలకు జిల్లా సరిహద్దులను దాటి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి వరకూ విందు అనంతరం 12 గంటల ప్రాంతంలో తమ జిల్లాలకు వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయమే ఎమ్మెల్యే ఇంట్లో తిష్టవేసి అక్కడి నుంచే నగదు పంపిణీపై సూచనలు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమాకు చెందిన ఏపీ16డీఎఫ్‌1314, బోడేప్రసాద్‌కు చెందిన ఏపీ16డీఏ567 కార్లు ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లడం కనిపించింది.

మంత్రి అమరనాథరెడ్డి వెలుగోడులో మకాం వేశారు. మరికొందరు మంత్రులు నంబర్‌ ప్లేట్లు తీసేసిన కార్లలో తిరుగుతున్నారు. ప్రధానంగా జమ్మలమడుగు, చిత్తూరు జిల్లాల నుంచి తీసుకొచ్చిన రూ.40 కోట్లు మొత్తాన్ని వైఎస్సార్‌సీపీకి పట్టున్న గోస్పాడు మండలంలో పంచిపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.  
 
ఉప పోరుకు సర్వం సిద్ధం
నంద్యాల ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ 
కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 2,18,858 మంది ఓటర్లు 15 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు 255 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్‌ కేంద్రాల వద్ద వరుసలో నిల్చున్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పోలింగ్‌ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కర్నూలు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.

గతంలో ఏ ఉప ఎన్నికకూ లేనివిధంగా నంద్యాల ఉప ఎన్నికకు బెంగాల్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హిమాన్స్‌ జ్యోతి చౌదరిని సాధారణ పరిశీలకుడిగా నియమిం చింది. ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ పోలింగ్‌ ప్రక్రియను లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించనున్నారు. ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినా.. ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే నెలకొంది. మొదటిసారిగా వీవీప్యాట్‌ యంత్రాల ద్వారా ఓటర్లు తాము ఏ గుర్తుకు ఓటు వేశామో.. ఆ గుర్తుకు ఓటు పడిందా, లేదా అని 7 సెకన్లపాటు చూసుకోవచ్చు. ఇది ఓటరుకు తప్ప ఇతరులకు తెలియదు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement