నంద్యాల గెలుపు.. రాజకీయాలకు మలుపు
►టీడీపీని చిత్తుగా ఓడించండి
►ఓటర్లకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పిలుపు
►ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన
నంద్యాల అర్బన్: ‘దేశ రాజకీయాల్లో నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విలక్షణమైన తీర్పు ఇవ్వడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి రాజకీయాలను మలుపు తిప్పాల’ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ గురువారం ఆయన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, పార్టీ సీఈసీ మెంబర్ రాజగోపాల్‌రెడ్డితో కలిసి పట్టణంలోని 1, 2 వార్డుల పరిధిలో గల పీవీనగర్, అరుంధతినగర్, సంగపేట, మాల్దారిపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నేతలకు స్థానికులు పూలమాలలు వేసి.. ఘన స్వాగతం పలికారు. అలాగే గోస్పాడు మండలంలోని ఎస్.నాగులవరం, నెహ్రూనగర్ గ్రామాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక గెలుపుతో టీడీపీ పతనం ప్రారంభమవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి నంద్యాల ప్రత్యేకతను చాటాలన్నారు.
బాబు బూటకపు హామీలకు మోసపోవద్దు...
ఓటర్లను ప్రలోభ పెట్టడం, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన బూటకపు హామీలకు మోసపోవద్దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే నంద్యాల అభివృద్ధి గుర్తుకు రావడం బాబు మోసకారితనానికి నిదర్శనమన్నారు. అమలు కాని హామీలు ఇస్తున్న బాబుకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు.
నాలుగు శాతం రిజర్వేషన్ల ఘనత వైఎస్సార్‌దే...
ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డిదేనని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా అన్నారు. రిజర్వేషన్‌తో ఎంతో మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, వారంతా వైఎస్సార్‌ను దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నో ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. అదే చంద్రబాబు ముస్లింలను భయపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని, ఆయనకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ కన్నమ్మ, మాజీ కౌన్సిలర్ మునెయ్య, భీమవరం సీనియర్ నాయకులు పార్థసారథిరెడ్డి, ఎర్రన్న, కడప మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, పులి, సునీల్‌కుమార్, పార్టీ ఎస్సీసెల్‌రాష్ట్ర కన్వీనర్ మద్దయ్య, దేశం సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.