ఇంకొక్క రోజు..
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తేలేది రేపే
కర్నూలు (అగ్రికల్చర్): రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఫలితం సోమవారం వెల్లడి కానుంది. ప్రస్తుతం ఈవీఎంలు కేంద్ర బలగాల రక్షణలో ఉన్నాయి. వీటిలో నిక్షిప్తమై ఉన్న ఫలితం సోమవారం ఉదయం 11 గంటలకల్లా వెల్లడయ్యే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో తీవ్ర స్థాయిలో పోరు సాగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ తెలుగు ప్రజలు ఈ ఫలితం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మధ్యనే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది. ఇటు వైఎస్సార్‌సీపీ, అటు తెలుగుదేశం పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టా్టత్మకంగా తీసుకొని సర్వశక్తులూ ఒడ్డాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ వెబ్ క్యాస్టింగ్
సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌కు మొత్తం 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒకటి రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఉంటాయి. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఉండగా 255 ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.