లైంగికదాడి యత్నంపై నన్నపనేని విచారణ
వేగివాడ(పెదవేగి రూరల్) : వేగివాడలో ముగ్గురు చిన్నారులపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటనపై మహిళా కమిషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి జిల్లా స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారుల సమక్షంలో గురువారం విచారణ చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా నిందితుని వికృతచేష్టలు వెలుగుచూశాయి. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. వేగివాడ ఎస్సీకాలనీలో కడిమి మరియన్న అలియాస్ (ఠాగూర్) ఈనెల 23న మంగళవారం ఓ చిన్నారిని సీఎస్‌ఐ చర్చి వెనుకవైపునకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేస్తూ పారిపోయింది.
అదేరోజు మధ్యాహ్నం మూడో తరగతి చదువుతున్న మరో చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు. బట్టలు తీసి ఫొటోలు తీస్తుండగా, ఆ చిన్నారి కేకలు వేస్తూ పారిపోయింది. పొద్దున్నే కూలిపనికి వెళ్లి సాయంత్రం వచ్చిన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఠాగూర్ వికృతచేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరిలానే ఈనెల 21న మరో బాలికపైనా మొక్కజొన్నతోటలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడని, దుస్తులు తీసివేసి వికృతచేష్టలకు పాల్పడ్డాడని బాధితులు విమర్శించారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని ఈ ముగ్గురు చిన్నారులను భయపెట్టాడని బాధితులు నన్నపనేనికి వివరించారు.
వివరాలన్నీ సావధానంగా విన్న నన్నపనేని కంటతడిపెట్టారు. అనంతరం బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులతో రహస్యంగా మాట్లాడారు. ఎస్సై వి.రామకోటేశ్వరరావు ఘటనా ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆర్‌జేడీ ఆర్.సూఈజ్, పీడీ జి.చంద్రశేఖర్, తహశీల్దార్ ఎం.ఇందిరాంగాంధీ, పెదపాడు ప్రాజెక్టు సీడీపీవో పి.హానుశ్రీ, ఏలూరు అర్బన్ సీడీపీవో జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నన్నపనేని విలేకరులతో మాట్లాడుతూ.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత పిల్లలను హోమ్‌లో పెట్టి చదివించాలని, ఇందులో ఓ పాపకు తండ్రి చనిపోయాడని, ఆమె తల్లికి జీవోనోపాధి మార్గం చూపిస్తామని వివరించారు. చిన్నారులకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు.