ఆదివాసీలు తరతరాలుగా అనుభవించిన సహజ వనరులు అభివృద్ధి పేరుతో దోపిడీకి గురవుతున్నాయని వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు పేర్కొన్నారు.
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్
ఆదివాసీలు తరతరాలుగా అనుభవించిన సహజ వనరులు అభివృద్ధి పేరుతో దోపిడీకి గురవుతున్నాయని వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు పేర్కొన్నారు. వారు అనుభవించే సహజ వనరులను ప్రభుత్వాలు బలవంతంగా లాక్కుంటున్నాయన్నారు. ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘గిరిజన మహిళలు - సాధికారిత’ అనే అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సును శుక్రవారం వీసీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరిక సమాజం గిరిజనులను అన్ని విధాలుగా వివక్షతకు గురిచేస్తోందని, గిరిజన మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా తయారయిందని తెలిపారు. రాజకీయ సంకల్పం ఉంటే తప్ప గిరిజనుల అభివృద్ధి సాధ్యం కాదన్నారు.
సోషియాలజీ విభాగ మాజీ కో- ఆర్డినేటర్ ఆచార్య లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ అభివృద్ధి సూచికలైన ఆరోగ్యం, విద్య, ఉపాధి, సమాజిక స్థితి గతంతో పోల్చితే చాలా దిగజారాయన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రత్యేక చట్టాలు ఏవీ ఆదివాసీల దరిచేరటం లేదని పేర్కొన్నారు. సదస్సు డెరైక్టర్ డాక్టర్ ఎం.త్రిమూర్తిరావు మాట్లాడుతూ గిరిజన మహిళల సమస్యలపై అధ్యయనం చేసి వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కావలసిన సూచనలు చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ సెన్సైస్ డీన్ ఆచార్య బి.సాంబశివరావు అధ్యక్షత వహించిన సభలో రెక్టార్ ఆచార్య వై.పి.రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఓఎస్డీ ఆచార్య ఎ.వి.దత్తాత్రేయరావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.మధుసూదనరావు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య అమర్‌నాథ్, గిరిజన సంక్షేమ విభాగం జనరల్ మేనేజర్ దేవర వాసు, ఏఎన్‌యూ మహిళా అధ్యయన కేంద్రం కో- ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్. స్వరూపరాణి తదితరులు ప్రసంగించారు. అనంతరం సదస్సు సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు.