జిల్లాలో చలి మొదలైంది. ప్రజల గుండెల్లో గుబులు తలెత్తింది. చలి తగ్గే వరకు వెచ్చని అనుబంధం కోసం వెతుకులాట ప్రారంభమైంది. పలువురు స్వెటర్లు, ఉన్నితో తయారు చేసిన దుస్తుల కొనుగోళ్లపై మక్కువ చూపుతున్నారు. ఫుట్‌పాత్ బిజినెస్ జోరుగా సాగుతోంది.
నెల్లూరు(బారకాసు): చలి అధికంగా ఉండడంతో ఉన్ని దుస్తులకు గిరాకీ ఏర్పడింది. వీటిని ఒడిశా, నేపాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల విక్రయదారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారుల పక్కనే ఏర్పాటు చేసుకున్న దుకాణాల్లో విక్రస్తున్నారు. వీటిలో స్వెట్టర్లు, టోపీలు, శాలువాలు, మఫ్‌లర్లు, దుప్పట్లు లభిస్తున్నాయి. ఇవి అందంగా.. మన్నికగా.. తక్కువ ధరల్లో ఉండటంతో జనం బాగా∙కొంటున్నారు.నెల్లూరు నగరం సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణం మరీ చల్లగా మారింది. రోజురోజుకి చలి పెరుగుతోంది. సాయంత్రం ఆరు గంటలకే మంచు కురవడం ప్రారంభమవుతోంది. రాత్రి తొమ్మిది గంటలు దాటితే మంచు పెరగడంతో విపరీతమైన చలితో వణికిపోయే పరిస్థితి. దీంతో నగర ప్రజలతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే వారందరిని చలి భయపెడుతోంది. దీని నుంచి రక్షణ పొందేందకు ముఖ్యంగా తెల్లవారుజామున పనిచేసే పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, పేపర్ బాయ్స్ తదితరులు ఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నారు.
నెల్లూరు: ఏసీ స్టేడియం ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్నిదుస్తులు విక్రయిస్తున్న వ్యాపారులు
రోడ్ల పక్కనే దుకాణాలు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు నగరంలోని జీటీరోడ్డు, పొదలకూరురోడ్డు, మినీబైపాస్‌రోడ్డు తదితర ప్రధాన రహదారుల పక్కనే దుకాణాలు ఏర్పాటు చేశారు. పలు రకాల డిజైన్లలో స్వెట్టర్లు, టోపీలు, శాలువాలు, మంకీ క్యాప్‌లు విక్రయిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ సైజుల్లో పలు డిజైన్లలో లభిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేక స్వెట్టర్లు కూడా ఉన్నాయి. స్వెటర్లు పెద్దలకు రూ.200 నుంచి రూ.800, చిన్నపిల్లలకు రూ.150నుంచి రూ.300 వరకు ఉన్నాయి. అదేవిధంగా చలికి, వర్షానికి వేసుకునేదుస్తులు రూ.600 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు.
తయారయ్యే ప్రాంతాలు
ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నేపాల్ వాసులకు నెల్లూరుతో 20 ఏళ్లుగా అనుబంధం ఉంది. చలికాలం మొదలవుతుందంటే ఆయా ప్రాంత వాసులు నెల్లూరు వచ్చేస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి ఉన్ని దుస్తులను తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వ్యాపారం సాగిస్తుంటారు.
వ్యాపారం చేసుకుని వెళ్లిపోతాం
చలికాలం ప్రారంభమయ్యే సమయంలో నెల్లూరు కు వచ్చి మూడునెలలపాటు ఇక్కడే ఉంటాం. తెచ్చిన ఉన్ని దుస్తులు అమ్ముకుని అనంతరం మా సొంత ఊరికి వెళ్లిపోతాం. దుస్తులు నాణ్యంగా ఉండటం వలనే జనం మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ధరలు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయి. నెల్లూరు ప్రజలు చాలా సౌమ్యులు. అందుకే ఈ ఊరుంటే మాకు ఇష్టం.– ప్రహ్లాద్, మధ్యప్రదేశ్
బృందాలుగా వ్యాపారం చేస్తుంటాం
మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను. మేము చాలామంది బృందాలుగా ఏర్పడి కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తాం. మాకు తెలుగు రాకపోయినా ఇక్కడి ప్రజల మమ్మల్ని ఆదరిస్తూ సహకరిస్తున్నారు.– ఉదయ్‌రాం, మధ్యప్రదేశ్
అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాం
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తుంటాం. వచ్చిన లాభంలో కొంత మొత్తాన్ని కుటుంబ పోషణకు పంపిస్తుంటాం. పెద్ద దుకాణాల్లో కంటే చౌకగా విక్రయిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగా జరుగుతుందని భావిస్తున్నాం.– పరశురాం, మధ్యప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment