ఆంధ్రప్రదేశ్ రాజధానికి లక్ష ఎకరాలు అవసరమని, దీన్ని దశలవారీగా సేకరిస్తామని మంత్రులు చెప్పారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన మొత్తం భూమిని ఆరు నెలల్లో సేకరించి, వర్గీకరించి, తర్వాత మరో ఆరునెలల్లో నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజధానిపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు, మంత్రి పి.నారాయణ చెప్పారు. రాజధాని అంటే సచివాలయం, హైకోర్టు, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉంటాయని తెలిపారు. రైతులకు ఎంత షేర్ ఇస్తారని అడిగినప్పుడు మాత్రం.. నేరుగా చెప్పకుండా ఇతర వివరాలు అన్నీ ఏకరువు పెట్టారు. చండీగఢ్లో ఎకరాకు 1100 చదరపు గజాలు ఇచ్చారని, అందులో వెయ్యి గజాలు రెసిడెన్షియల్, 100 గజాలు కమర్షియల్ ఇచ్చారని తెలిపారు. ఇది 22-23 శాతం అవుతుందన్నారు. గాంధీనగర్లో అభివృద్ధి చేసినదాంట్లో 25 శాతం, నయా రాయ్పూర్లో అభివృద్ధి చేసినదాంట్లో 35 శాతం ఇచ్చామన్నా, వాస్తవానికి వారికి వెళ్లింది 29 శాతమేనన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాంతాన్ని బట్టి, అక్కడ అభివృద్ధి చేయడానికి అయిన వ్యయాన్ని బట్టి ఎంత వాటా ఇవ్వాలన్నది నిర్ణయిస్తామన్నారు.
ఆధునిక సదుపాయాలతో రాజధాని నగరాన్ని నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఇంతవరకు నాలుగు పద్ధతుల్లో భూసేకరణ జరిపారని, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. మొత్తం లక్ష ఎకరాల వరకు భూమిని సేకరించాలని నిర్ణయించామని, తొలిదశలో 25 వేల ఎకరాలు, రెండో దశలో మరో 25 వేల ఎకరాలు సేకరిస్తామన్నారు. గుంటూరు, తెనాలి, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలు కవరయ్యేలా స్థల సేకరణ చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే సమావేశానికి రెండు జిల్లాల కలెక్టర్లను రమ్మని కోరామన్నారు.
రైతులకు అనుకూలంగా విన్-విన్ పద్ధతిలోనే ల్యాండ్ పూలింగ్ చేయాలని అనుకుంటున్నామని, దేశంలోకెల్లా అందమైన రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వా ఆలోచన అని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీన్ని రైతుల సహకారంతోనే నిర్మిస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్లోకి వెళ్లినా, తమకు ఇప్పుడు ఉన్న ధరల కంటే ఎక్కువ రేట్లే వస్తాయని రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఎకరాకు ఎంత ఆదాయం వస్తోందో, అంత చొప్పున డెవలప్మెంట్ పూర్తయ్యేవరకు ప్రభుత్వం వారికి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఉపయోగించని భూమినే తాము వినియోగంలోకి తెస్తామని అన్నారు.