
దేశవ్యాప్తంగా కొత్త విద్యావిధానం
- కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతిఇరానీ వెల్లడి
- 26న ఈ విద్యావిధానాన్ని ప్రకటించనున్న ప్రధాని మోదీ
- విశాఖ ఐఐఎంకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ ఈ విద్యావిధానాన్ని ప్రకటించబోతున్నారని ఆమె తెలిపారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి మంజూరైన జాతీయ విద్యాసంస్థల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖ(ఐఐఎంవీ)కు శనివారం జిల్లాలోని ఆనందపురం మండలం గంభీరంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులతో కలిసి స్మృతిఇరానీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రపంచంతో పోటీపడేలా ప్రస్తుత విద్యావిధానంలో సమూలంగా సంస్కరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువులు కొద్దిమందికేనన్న భావనను తొలగించాలన్న ఆలోచనతో ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి విద్యాసంస్థల్లో తొలిసారిగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో బోధించే పాఠ్యాంశాలను ఆన్‌లైన్‌లో పెడుతున్నామని.. ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చునన్నారు. తొలిసారిగా సర్టిఫికెట్ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నామన్నారు.
నామినల్ ఫీజులతోనే ఈ కోర్సులు చేయవచ్చునన్నారు. ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులు ఫీజులు చెల్లించనక్కర్లేదన్నారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన జాతీయ విద్యాసంస్థల్లో విశాఖ ఐఐఎంకు తొలిసారిగా శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఐఐఎం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తామన్నారు. విశాఖ ఐఐఎం బాధ్యతను బెంగళూరు ఐఐఎంకు అప్పగిస్తున్నామని, ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఐఐఎంను జాతికి అంకితం చేయబోతున్నట్టు ప్రకటించారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి ఏపీకి దక్కాల్సిన ప్రతీ ప్రాజెక్టు.. ప్రతీ పైసా సాధించుకునేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగువారి తెలివితేటలు అమోఘమైనవని, మైక్రోసాఫ్ట్ సంస్థకు మన తెలుగోడే అధినేత కావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఐఐఎంకు చివర వి(విశాఖ) అని చేర్చాలని.. అప్పుడే వైజాగ్‌కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు.
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి: సీఎం
విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఏపీనే ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లోని విద్యావిధానాన్ని, కోర్సులను మన దేశంలోనూ ప్రవేశపెట్టేందుకు వీలుగా ఏపీ భాగస్వామ్యంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సాగరమాలలో విశాఖ-కాకినాడల మధ్య పోర్టులను కలుపుతూ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. యూఎస్‌ఏ సహకారంతో విశాఖను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు త్వరలో ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామన్నారు.
నిరసనల సెగ..
వెంకయ్యనాయుడు మాట్లాడుతున్న సమయంలో సభాప్రాంగణంలో విజిటర్స్‌కోసం ఏర్పాటు చేసిన టెంట్(గుడారం)లో కొంతభాగం గాలికి ఎగిరిపోయింది. దీంతో స్వల్ప గందరగోళం నెలకొంది. హుద్‌హుద్ తుపానే ఏమీ చేయలేకపోయింది.. ఈ గాలి మనల్ని ఏం చేస్తుందిలే అని ఆయన అనడంతో పరిస్థితి సద్దుమణిగింది. మరోవైపు ఈ సభకు నిరసనల సెగ తగిలింది. ఆనందపురంలోని సంతోషిమాత ఆలయ ధర్మకర్త బత్తుల జగన్మోహన్ సీఎంను కలుసుకునేందుకు అవకాశమివ్వకపోతే చచ్చిపోతానంటూ హడావుడి చేశారు.
పోలీసులు ఆయన్ను తీసుకెళ్లిపోయారు. మరోవైపు పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు మాట్లాడుతూ.. డ్వాక్రా రుణమాఫీకోసం చంద్రబాబు ప్రకటన చేస్తారని నమ్మించి తీసుకొచ్చారని, తీరా ఇక్కడికొస్తే ఏదేదో మాట్లాడుతున్నారని, సీఎంతో మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ కేకలేశారు. సభ అయిపోయాక సీఎంను కలిసి మాట్లాడవచ్చునంటూ పోలీసులు సర్దిచెప్పారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. మరోవైపు ఐఐఎం భూముల బాధితులకు హౌస్‌అరెస్ట్ తప్పలేదు.
భూముల విషయంలో జరిపిన చర్చలు సఫలీకృతమైనప్పటికీ వారికీ పరిస్థితి ఎదురైంది. వారినుంచి శంకుస్థాపన కార్యక్రమానికి ఏ ఇబ్బందీ ఎదురవకుండా చూడాలన్న ఆదేశాలనేపథ్యంలో పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లి దాదాపు 30 మందిని ఇళ్లనుంచి బయటకు రాకుండా శుక్రవారం నుంచే కాపలా కాశారు. శనివారం వారు ఆందోళనకు దిగడంతో సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పి కొందరిని సభాస్థలికి తీసుకొచ్చారు. అయితే సీఎంతో కలవకుండా వారిని తమ నిర్బంధంలోనే ఉంచుకున్నారు.