నవ తెలంగాణ నిర్మాణం కోసం ఈనెల 12 తర్వాత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు.
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : నవ తెలంగాణ నిర్మాణం కోసం ఈనెల 12 తర్వాత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానన్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జూలై 30 తర్వాత ఆ ప్రస్తావనే తేవడం లేదన్నారు.
1969నాటి నుంచి నేటి వరకు తెలంగాణ పోరాటంలో అసువులుబాసిన అమరవీరుల చరిత్రను మరుగుపరిచేందుకు కుట్రలు జరిగాయన్నారు. అమరులను కనీసం స్మరించుకోకుండా కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్రలు, టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించడం శోచనీయమన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును పెట్టాలంటూ ఈ నెల 27, 28 తేదీల్లో తెలంగాణ విద్యార్థి ఆధ్వర్యంలో ‘చలో పార్లమెంట్’ను నిర్వహిస్తామని చెప్పారు.