కొత్తకార్డులకు లైన్ క్లియర్
Published Sun, Oct 27 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సామాన్యుల నిరీక్షణ ఫలించనుంది. రేషన్ కార్డులు లేక అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్న పేదల కోరిక నెరవేరే సమయం దగ్గర్లోనే ఉంది. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ప్రజలు ఏడాదిన్నర కాలంగా నిరీక్షిస్తున్నారు. పదవుల పందారంలో పడిన పాలకులు మరోసారి రచ్చబండకు సిద్ధం కావడంతో ఎట్టకేలకు హామీలపై దృష్టి సారించారు. గతంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాల ని ఆదేశాలు వచ్చాయి. అయితే అధికారులు కొన్ని నెలల క్రితమే అర్హులను గుర్తించి జాబితా సిద్ధం చేశారు. అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. పౌరసరఫరాల ఉన్నతాధికారులు కొత్త కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ చేయడంతో కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించనుంది.
గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కొత్తకార్డు లు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, కార్డుల విభజన, గులాబీ కార్డుల నుంచి తెలుపు కార్డులుగా మార్చాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా 71,432 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 64,690 దరఖాస్తులు అర్హత గలవిగా అధికారు లు తేల్చారు. అర్హులకు అందజేయడానికి ఇప్పటికే 24,726 కార్డులు సిద్ధం చేశారు. కొత్తకార్డుల కోసం 27,017, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చటానికి 16,740, కార్డుల విభజన కోసం 18076, గులాబీ నుంచి తెలుపు, తెలుపుకార్డుల నుంచి అంత్యోదయ కార్డుల కోసం వచ్చిన 48 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. 729 దరఖాస్తులు మినహాయించి మిగిలిన వివరా లు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే వీరందరికీ ప్రయోజనం కలగనుంది.
Advertisement