నేటి నుంచి రచ్చబండ
Published Mon, Nov 11 2013 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రెండేళ్లుగా ప్రజాసమస్యలు పట్టని పాలకులు తమ ఉనికి కోసం రచ్చబండ పేరుతో సోమవారం నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమ నిర్వహణలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి విశిష్ట అధికారాలు కట్టబెట్టారు. మండల స్థాయి కమిటీల నియామకం కూడా ఇన్‌చార్జ్ మంత్రి సూచనల మేరకే జరగాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి మంత్రి పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో జిల్లా స్థాయిలో రచ్చబండ కార్యక్రమం చప్పగా సాగనుంది. సోమవారం నుంచి రచ్చబండ ప్రారంభం అవుతున్నప్పటికీ ఇంకా షెడ్యూల్ ఖరారు చేయలేదు.
విజయనగరంలో ఖరారు కాని షెడ్యూల్...
వాస్తవానికి రచ్చబండ కార్యక్రమం ప్రారంభానికి ముందే సంబంధిత ఎమ్మెల్యేల నుంచి తేదీ లు నిర్ణయించాలని ప్రభుత్వం సూచించింది. ఇంతవరకూ కొంతమంది అధికారులు ఎమ్యెల్యేల వద్దకే వెళ్లలేదు. ఒక వేళ ముందు తేదీలు ఖరారు చేసినప్పటికీ పరిస్థితిని బట్టి తేదీలు మార్పు చేసుకోవచ్చు. విజయనగరానికి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఇంతవరకూ మండలస్థాయి అధికారులు కలవలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలు అందజేశారే తప్ప కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ కోసం ఇంతవరకూ చర్చించలేదు. సోమవారం కలుస్తామని అధికారులు చెప్పడం విశేషం.
పెండింగ్‌లో గత దరఖాస్తులు.....
గత రెండు విడతల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం 75వేల దరఖాస్తులు అందాయి. వీటిలో అర్హమైనవి 65వేలుగా గుర్తించారు.అయితే ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో కేవలం 29వేల కొత్తకార్డులు,పేర్లు చేర్పులకు సంబంధించి 15,536 మాత్రమే అందజేయనున్నారు. అలాగే వివిధ రకాల పింఛన్ల కోసం జిల్లావ్యాప్తంగా 50,860 దరఖాస్తులు అందాయి. వీటిలో ప్రస్తుతం 28,194 పింఛన్ల పంపిణీకి మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇందిర మ్మ ఇళ్లకు సంబంధించి లక్షా 10వేల దరఖాస్తులు అందాయి. వాటిలో అధికారులు సర్వే చేసి 87వేలకు పైగా అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ప్రస్తుతం 55,335 మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
జిల్లాలో రచ్చబండ
జరుగుతుందిలా...
జిల్లాలో 34 మండలాలు, నాలుగు మున్సిపాల్టీలతో పాటు ఒక నగర పంచాయతీ ఉంది. వీటిలో మున్సిపాల్టీలు, నగర పంచాయతీ సహా 13 రచ్చబండలు కేవలం మండల కేంద్రాల్లోనే జరుగుతాయి. మిగిలిన 21 మండలాల్లో పంచాయతీల వారీగా రచ్చబండ కార్యక్రమాలు జరగనున్నాయి.తొలిరోజు రామభద్రపురం, దత్తిరాజేరు, చీపురుపల్లి, డెంకాడ మండలాల్లో రచ్చబండ కార్యక్రమాలు జరగనున్నాయి. మండల కేంద్రాల్లో మాత్రమే రచ్చబండలు జరగనున్న మండలాలివే. కొమరాడ,గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, పార్వతీపురం, కురుపాం, ఎస్‌కోట, వేపాడ, ఎల్‌కోట, కొత్తవలస, సీతానగరం, బలిజిపేట,విజయనగరం. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించడానికి నియోజకవర్గానికో ప్రచార రథంతో పాటు, కళాజాతాలు ఏర్పాటు చేస్తున్నారు.
Advertisement
Advertisement