సాక్షి, పెద్దారవీడు: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. యువత ప్రలోభాలకు లొంగి ఓటేస్తే వచ్చే ఐదేళ్లు ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థ నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. స్వార్థపరులు, అబద్ధాలు చెప్పే వ్యక్తులకు ఓటు వేయకూడదు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తికే ఓటు వేయాలి. ఇదీ యువత మనోగతం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా సమర్థవంతమైన పాలన అందించాలి. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడికే పట్టం కడతామని యువ ఓటర్లు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం ప్రజల మధ్య ఉండే యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు మేము సైతం అంటూ ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. యువత ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని పేర్కొనడం విశేషం.
హోదా కోసం పోరాడిన నాయకుడికే నా ఓటు
మొదటి సారి ఓటు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఓటు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన నాయకుడికే వేస్తాను. మా భవిష్యత్ ప్రత్యేక హోదాపైనే ఆధారపడి ఉంది. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వినియోగించుకుంటాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధ్వాన్నంగా ఉంది. రాష్ట్రానికి మేలు చేసే వారికే పట్టం కడతాం. ఈ కష్టాలు పోవాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న పార్టీకే నా ఓటు. మాటపై నిలబడే నాయకుడికే యువత పట్టం కడతాం.
– ఒద్దుల మాలతి, సానికవరం గ్రామం
భవిష్యత్తు కోసం ఓటు
రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రచార ఆర్భాటమే తప్ప పురోగతి కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌కి సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఉంది. యువత మేల్కొనే సమయం వచ్చింది. నా ఓటు బంగారు భవిష్యత్ కోసం వేస్తాను. రాష్టాన్ని సుభిక్షంగా, అభివృద్ధి దిశలో నడిపించే సత్తా కలిగిన నాయకకుడికే నా మొదటి ఓటు. కొత్త ఓటర్లు బాగా ఆలోచించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.
– మూల హర్షవర్ధన్‌రెడ్డి, బద్వీడుచెర్లోపల్లె గ్రామం
ప్రలోభాలకు గురికావొద్దు
సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను ఓటు వేయాలి. ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఓటు దుర్వినియోగంతో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నష్టం కలుగుతోంది. మంచి నాయకున్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.
– దుగ్గెంపూడి జగన్‌మోహన్‌రెడ్డి, మల్లవరం గ్రామం
ఓటే మార్పుకు నాంది
ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకునే నాయకునికి ఓటు వేస్తాం. ముఖ్యంగా కొత్త ఓటర్లు బాగా ఆలోచించి ఓటు వేయాలి. సంక్షేమం, సమాజాభివృద్ధి గురించి పాటు పడే నాయకున్ని ఎన్నుకోవాలి. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలను చేపట్టే వారికే పట్టం కట్టాలి. ఓటు వజ్రాయుధం. ఓటే మార్పుకు నాంది. ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును నిజాయతీగా వినియోగించుకోవాలి.
– అల్లు పద్మ, పెద్దారవీడు గ్రామం
భవిష్యత్ భరోసాకే నా ఓటు
భవిష్యత్‌కు భరోసా కల్పించే నాయకుడికే నా ఓటు వేస్తా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పంచే నాయకుడికే నా ప్రాధాన్యత. విద్యావంతులతో పాటు ప్రతి ఒక్కరూ అలోచించి ఓటు వేయాలి. ఇప్పటి వరకు చాలా మంది చాలా వాగ్ధానాలు చేశారు. అవి మాటలకే పరిమితం అయ్యాయి. జగనన్న అధికారంలోకి వస్తే ప్రతి కుంటుంబం సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు చూసిన పాలకతో పోల్చుకుంటే భవిష్యత్తు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వెలుగులు విరజిమ్ముతుందని భావిస్తున్నా.
– ఏర్వ వెంకటేశ్వరరెడ్డి, మద్దలకట్ట గ్రామం
ఓటు వేసేందుకు ఆత్రుతగా ఉంది
నా ఓటు నిజాయతీగా వేస్తాను. మొదటి సారి ఓటు వేయడానికి చాలా ఆత్రుతగా, సంతోషంగా ఉంది. భారత పౌరురాలిగా ఎన్నికల్లో నా హక్కును ఓటు రూపంలో వినియోగించుకుంటాను. నేటి ప్రభుత్వాలు అవినీతిమయంగా మారిపోయాయి. పాలకులు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. గెలుపు కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నారు. గతంతో ఇచ్చిన హామీలు నేరవేర్చని వారు ఓటు అడిగే హక్కును కోల్పోయారు. అన్ని రంగాల్లో మార్పు రావాలి. అది యువతతోనే సాధ్యమవుతుంది.
– సొంటి సౌజన్య, తోకపల్లె గ్రామం
ఓటు అమ్ముకోను
రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి నిలిచింది. ప్రభుత్వాలు అవినీతి ప్రోత్సహించడం చూస్తుంటే భయం వేస్తోంది. రాష్ట్రం పురోగతి సాధించాలంటే యువ నాయకత్వానికి ఓటు వేయాలి. నా ఓటు నోటుకు అమ్ముకోను. అందుకే అవినీతిని రూపుమాపే నాయకుడికే నా తొలి ఓటు వేస్తాను. ప్రలోభాలు, మభ్యపెట్టే మాటలు, నోట్లతో యువతను మోసగించలేరు.
– అల్లు బలరామిరెడ్డి, పెద్దారవీడు గ్రామం
Comments
Please login to add a commentAdd a comment