
వచ్చే నెలలో సీఎం, నేను రాజీనామా చేస్తున్నాం: పితాని
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెలలో రాజీనామా చేసేందుకు ముహూర్తం నిర్ణరుుంచుకున్నారని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు
యలమంచిలి, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెలలో రాజీనామా చేసేందుకు ముహూర్తం నిర్ణరుుంచుకున్నారని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పితాని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్ వచ్చే నెలలో రాజీనామా చేస్తారని, ఆ వెంటనే తాను కూడా రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. విభజనకు అనుకూలంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ లేఖలు ఇచ్చినందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. అయితే సీమాంధ్రలో ఉద్యమం వెల్లువెత్తడంతో మిగిలిన పార్టీలు యూటర్న్ తీసుకున్నాయన్నారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన నెపం కాంగ్రెస్ పార్టీపై పడిందన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో తామం తా సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నామని చెప్పారు. ఆ దిశగానే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రాజీనామాలు చేయాలని నిశ్చయించుకున్నట్టు పితాని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ‘సమైక్య’ ముద్రకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం.. తన సన్నిహిత మంత్రి పితాని నోటివెంట ఈ మాటలు చెప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండడం గమనార్హం.