Adari Tulasi Rao: ఆంధ్రా కురియన్‌కు నివాళి! | Tribute to Visakha Dairy Chairman Adari Tulasi Rao | Sakshi
Sakshi News home page

Adari Tulasi Rao: ఆంధ్రా కురియన్‌కు నివాళి!

Published Fri, Jan 6 2023 1:06 PM | Last Updated on Fri, Jan 6 2023 2:04 PM

Tribute to Visakha Dairy Chairman Adari Tulasi Rao - Sakshi

ఆడారి తులసీరావు

అనూహ్యమైన, అనితరసాధ్యమైన పాల ఉత్పత్తి రంగంలో విజయాలు సాధించిన ఆడారి తులసీరావు ఈనెల 4వ తేదీన మరణించారు. మూడున్నర దశాబ్దాలు విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా వ్యవహరించి, రైతుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ప్రతి ఒక్క రైతుతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ ఉండేవారు. డెయిరీకి పాలు సరఫరా చేసే వేలాదిమంది రైతుల పిల్లలకు అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించారు. పాడి రైతులలో పేదవారి పిల్లలకు హాస్టలు వసతి కల్పించి, ఉచిత విద్యను బోధింపజేసిన సేవాదృక్పథం ఆయనది.

రైతాంగ యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆత్మ విశ్వాసంతో వ్యవసాయాన్నీ, పాడినీ అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఆత్మ గౌరవంతో జీవించడానికి ప్రయత్నించాలని తరచూ తన అనుభవాలు జోడించి ఉద్బోధించేవారు. పాలను సేకరించి, వినియోగదారులకు పాలు, పెరుగు, మజ్జిగ అమ్మడమే ప్రధానంగా కొనసాగిన విశాఖ డెయిరీ, అనంతర కాలంలో ఆ పాలతో అనేక ఇతర ఆహార ఉత్పత్తులు ప్రారంభించి రుచి, శుచిలో అగ్ర తాంబూలం అందుకునేలా చేసిన సవ్యసాచి ఆయన. 

ఆంధ్రా కురియన్‌గా కీర్తించబడినా కించిత్‌ గర్వం, అతిశయం దరిచేరనివ్వని వ్యక్తిత్వ శైలి ఆయనది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో డెయిరీ కార్యకలాపాలను నిర్వహిస్తూనే, యలమంచిలి నియోజక వర్గం రాజకీయాలలో ఆరు దశాబ్దాలు క్రియాశీల పాత్ర పోషించారు. ఆనాటి విశాఖ జిల్లా బోర్డు సభ్యునిగా వ్యవహరించిన తన తాత స్వర్గీయ ఆడారివీరు నాయుడు ఆయనకు స్ఫూర్తి. నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి పంచాయతీకి మూడుసార్లు సర్పంచ్‌గా ఎన్నికైనారు. యల మంచిలి పురపాలక సంఘంగా మారిన తర్వాత రెండుసార్లు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

2015 డిసెంబరులో భారత పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ తన 37వ జాతీయ సమావేశంలో తులసీరావు పోస్టల్‌ స్టాంపును విడుదల చేయడం, ఆడారి కీర్తి కిరీటంలో కలికితురాయి. లక్షలాదిమంది రైతులు, వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవితాలకు బతుకుదెరువు చూపించిన దార్శనికుడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా ఆడారి తులసీరావు అంత్యక్రియల్లో పాల్గొనడం ఆయన మృతికి గొప్ప నివాళి. ఆయన మరణించినా, పల్లెల్లో ఆయన నిర్మింపజేసిన వందలాది కట్టడాలు ఆయన సేవలను మరింత చిరస్మరణీయం చేస్తాయి. లక్షలాది కుటుంబాలు తరతరాలు ఆ మహనీయునికి రుణపడి ఉంటాయి. (క్లిక్ చేయండి: ఆయన జీవితం.. స్ఫూర్తివంతం.. ఫలవంతం)

– బి.వి. అప్పారావు, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement