సాక్షి, అనకాపల్లి జిల్లా: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రలోభాలు, మాయమాటలతో మభ్యపెట్టి అయిష్టంగా తమ పార్టీల్లోకి చేర్చుకోవడానికి యత్నించిన కూటమి పార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ఝలక్ ఇస్తున్నారు. కూటమి పార్టీకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదోలా గెలవడానికి ప్రయత్నించిన ఆ పార్టీల నేతలు భంగపడిన ఘటన యలమంచిలి మండలంలో చోటు చేసుకుంది.
మండలంలోని జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పదవిలో ఉన్నారు. ఈ నెల 8న ఉమను మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, మరికొంత మంది జనసేన రాష్ట్ర, స్థానిక నేతల సమక్షంలో జనసేన పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. ఈ మేరకు ఉమకు జనసేన పార్టీ కండువా వేసిన ఫోటోలను మీడియాకు పంపించారు. అయితే కేవలం 5 రోజుల్లోనే శిలపరశెట్టి ఉమ తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు.
బుధవారం తాడేపల్లిలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన యలమంచిలి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో ఉమ ఆమె భర్త గణేష్‌తో హాజరయ్యారు. సమావేశంలో భాగంగా మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. జనసేనలో ఐదు రోజులు కూడా ఇమడలేక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
ఎంపీటీసీల సమావేశం ఉందని మాయమాటలు చెప్పి బలవంతంగా జనసేన కండువా వేశారని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని శిలపరశెట్టి ఉమ సాక్షికి తెలిపారు. పార్టీ అధినేత జగనన్నతోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు. ఈ పరిణామం నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేవలం ఐదు రోజుల్లోనే జనసేనను వీడడంతో లేని బలం ఉన్నట్టు చూపించుకోవడానికి ప్రయత్నించిన జనసేన నేతలు అభాసుపాలైనట్టయిందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment