ఏలూరు:రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపర్చే అంశాలు, అంచనాలపై విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నిర్వహించే సమావేశానికి కలెక్టర్ కె.భాస్కర్ నివేదికలను సిద్ధం చేయించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కలెక్టర్ కె.భాస్కర్, డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి హాజరుకానున్నారు. 2015-16 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి సంబంధించి పొందుపర్చాల్సిన అంశాలపై కలెక్టరేట్ యంత్రాంగం మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు కుస్తీలు పట్టి నివేదికలు సిద్ధం చేసింది. కలెక్టర్ భాస్కర్ మంగళవారం ఉదయానికే హైదరాబాద్ వెళ్లి ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలెక్టర్ భేటీ అయినట్టు తెలిసింది.
నిట్‌పైనే ప్రధాన దృష్టి
జిల్లాలో నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణపై అధికార యంత్రాం గం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పెదపాడు సమీపంలోని భోగాపురంలో 258 ఎకరాల పైబడి భూములు ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం హైదరాబాద్ వెళ్లిన కలెక్టర్ ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్‌కు నివేదించినట్టు సమాచారం. నరసాపురంలో పోర్టు నిర్మాణానికి 5-6 వేల ఎకరాల అటవీ భూములను సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో భూముల సేకరణకు సంబంధించి కలెక్టర్ నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తోంది. పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించ తలపెట్టిన పోలవరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూముల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని సైతం కలెక్టర్ సిద్ధం చేశారు.
పునరావాసంపైనా నివేదిక
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం క ల్పించే వ్యవహారం ప్రహసనంగా మారింది. ఏడు ముంపు గ్రామాల పరిధిలోని ప్రజలకు పూర్తిస్థారుులో పునరావాసం సమకూరలేదు. దీనికితోడు ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, అక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని 21 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను సైతం సీఎంకు సమర్పించనున్నట్టు సమాచారం. గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఇటీవల రూపొందించిన ప్రతిపాదనల సమాచారంతో కలెక్టర్ నివేదిక సమర్పించనున్నారు.
పుష్కరాలు.. విలీన మండలాలపై పోలీస్ ఫైల్
పుష్కరాల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, సిబ్బంది అవసరం తదితర అంశాలపై పోలీస్ విభాగం తరఫున జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి నివేదిక రూపొందించారు. ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో పోలీస్ సిబ్బంది నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
నిట్.. పోర్టు
Published Wed, Jan 7 2015 2:01 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement