![Nirudyoga Bruthi Is A Publicity Stunt - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/30/CM-YUVA.jpg.webp?itok=7RW8_H3B)
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట..వచ్చిన తర్వాత మరో మాట చెబుతూ ముందుకు వెళుతోంది. నిరుద్యోగ భృతి విషయంలోనూ నాలుగున్నరేళ్లు గడిచే వరకు మొద్దునిద్రలో ఉన్న టీడీపీ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో మేలుకుంది. అదీ కూడా ఇంటింటికి ఉద్యోగం...లేకుంటే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 1000కే పరిమితం చేసింది. అదీ కూడా ఆగస్టు నుంచి ఇచ్చేందుకు సన్నద్ధమని, తర్వాత అక్టోబరు 2కు కథ మారింది. ఎంత మారినా మళ్లీ సవాలక్ష ఆంక్షలతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. అక్టోబరు నుంచి అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో జిల్లాలో వేల మంది దరఖాస్తు చేస్తే రకరకాల నిబంధనల పేరుతో అధికశాతం మందికి నిరాకరించి కొంతమందికే భృతి ఇస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం.
ఓట్లే లక్ష్యంగా...
జిల్లాలో నిరుద్యోగ భృతికి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నాలుగున్నరేళ్ల తర్వాత చివరి అంకంలో ఓట్లే లక్ష్యంగా అడుగులు వేసింది. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌లో దాదాపు 7.15 లక్షల పైచిలుకు నమోదైనా ఓటీపీ జనరేట్ చేసిన వారు 5.73 లక్షల మంది ఉన్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తుకు ప్రయత్నించారు. అయితే నిబంధనల సాకుతో కోత వేశారు. కొందరికి ఓటీపీ రిజెక్ట్ అయితే, మరికొందరికి సక్సెస్ అయినా కూడా సమస్యలు వేధించాయి. సర్టిఫికెట్లు సమర్పించలేదనో లేదా వయస్సు దాటిపోయిందనో సాకులు చూపుతూ యువతకు భృతిని దూరం చేస్తున్నారు.
జిల్లాలో 23 వేల మందికి భృతి
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభాన్ని అట్టహాసం చేసినా పరిస్థితి చూస్తే మాత్రం ఆర్భాటం మాత్రమే కనిపిస్తోంది. ఊహకు అందని స్థాయిలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. వీరిని సమస్యలు వెంటాడాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 23 వేల మందిని మాత్రమే అర్హులుగా తేల్చి కేవలం ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున అందిస్తున్నారు. అదీ కూడా మే నెలలో కేబినెట్ సమావేశం జరిగినా.... జూన్ వరకు స్పష్టత ఇవ్వకపోవడం...తర్వాత మరికొన్ని రోజులకు జీఓ విడుదల చేసి....ఆగస్టు అనుకున్నా అప్పుడు కూడా అందించకుండా అక్టోబరు 2న అట్టహాసంగా ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి ఉద్యోగం...లేకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్నా తీరా చివరలో రూ. 1000 పేరుతో అందిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment