అయ్యో పాపం దత్తన్న..
తెలంగాణ ప్రాంతంలో బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న బండారు దత్తాత్రేయకు ప్రధాని నరేంద్రమోడీ షాకిచ్చారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో మంత్రి పదవి గ్యారంటి అనే గంపెడాశతో ఢిల్లీ ఫ్లైయిట్ ఎక్కిన దత్తనకు నిరాశే మిగిలింది. తనకు కేంద్రమంత్రి పదవి దక్కపోవడంపై బీజేపీ సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయినట్టు తెలుస్తోంది.
సికింద్రాబాద్ లోకసభ నుంచి భారీ మెజార్టీతో ఎంపికైన దత్తాత్రేయ మంత్రి పదవి దక్కుతుందని లష్కర్ నేతలు కూడా ఎదురు చూశారు. సికింద్రాబాద్ లోకసభ టికెట్ ను దత్తన్నకు కేటాయింపు వ్యవహారంపై కూడా పెద్ద రచ్చ జరిగింది. సికింద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయాలని బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే దత్తన్న తన పలుకుబడితో టికెట్ దక్కించకున్నా.. మంత్రి పదవిని చేజిక్కించుకోలేకపోయారనే వాదన రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
అయితే లోకసభ మొదటి సమావేశాల తర్వాత జరగబోయే విస్తరణలో మంత్రి పదవి దక్కుంతుందని దేశ రాజధానిలో సీనియర్ బీజేపీ నేతలు భరోసా ఇచ్చారట. ఏది ఏమైనా శాఖ కేటాయించకుండా షాక్ ఇవ్వడంపై దత్తన్న వర్గం గుస్సాగా ఉందంట.