తెలంగాణపై పాతపాటే పాడిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ''సాధ్యమైనంత త్వరలో మా ప్రక్రియ పూర్తి చేస్తాం'' అని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే పాతపాటే పాడారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఈ ఉదయం సమావేశమై తెలంగాణ బిల్లు ముసాయిదాపై దాదాపు గంటన్నరసేపు చర్చించింది. కేంద్రానికి తుది నివేదిక ఇవ్వడానికి కసరత్తు చేసింది. ఒక నిర్ణయానికి మాత్రం రాలేకపోయింది.
సమావేశం ముగిసిన తరువాత షిండే విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి కేంద్ర మంత్రులు చిదంబరం, గులామ్ నబీ ఆజాద్ హాజరుకాలేదని తెలిపారు. చిదంబరం విదేశీ పర్యటనకు వెళ్లినందున హాజరుకాలేకపోయినట్లు చెప్పారు. జిఓఎం మళ్లీ ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ రోజు జరుగవలసిన కేంద్ర మంత్రి మండలి సమావేశం వాయిదాపడిన విషయం తెలసిందే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న కారణంగా ఈ సమావేశం వాయిదాపడింది.