నది మధ్యలో ఇసుక బస్తాలతో దిబ్బను సృష్టించిన దృశ్యం
సాక్షి, అమరావతి బ్యూరో: పోలీసులు తమ స్వామి భక్తిని నిరూపించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినా వారి తీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు. ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా నదిలోకి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను అనుమతించట్లేదు. బలవంతంగా నదిలోకి ప్రవేశించాలని చూస్తే అరెస్ట్ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రస్తుతం భూమి ధరలకు రెక్కలు వచ్చాయి.
అధికార పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై కృష్ణా నదిని చెరపట్టారు. నదిలో అక్రమంగా ఇసుక దిబ్బలను నిర్మించి, అవి తమ పరిధిలోనివే అని తప్పుడు ధ్రువపత్రాలను సృష్టిస్తున్నారు. కృత్రిమంగా నిర్మించిన దిబ్బల్లో రిసార్టులు, క్లబ్‌లు ఏర్పాటు చేసి కోట్లకు అధిపతులు అవ్వాలని చూస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు ఎప్పటికప్పుడు ఈ అక్రమాలపై ప్రశ్నిస్తూ.. నిలదీస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారు నదిలో పర్యటిస్తే తమ అక్రమాలు ఇంకా ఎక్కడ బయటపడతాయనే భయంతో టీడీపీ నాయకులు పోలీసుల సాయంతో అడ్డుకోవాలని చూస్తున్నారు.
అరెస్ట్ చేస్తామని హెచ్చరిక
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గుంటుపల్లిలో టీడీపీ నాయకులు నదీ గర్భాన్ని ఆక్రమించారు. సుమారు 65 ఎకరాల్లో పాగా వేసి ఇసుక దిబ్బలను సృష్టించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ఇటీవల వెలుగులోకి తేవడంతో స్పందించిన కలెక్టర్ ఆ దిబ్బలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు కారకులైన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మరిన్ని అక్రమాలు బట్టబయలు కాకుండా అధికార పార్టీ నాయకులు పోలీసులనే రంగంలోకి దించారు. కృష్ణా నదిలోకి వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రవేశిస్తే అరెస్ట్ చేస్తామని తుళ్లూరు పోలీసులు హెచ్చరించారు. అక్రమార్కులను అడ్డుకోవాల్సింది పోయి, వాటిని అడ్డుకుంటున్న వారికి హెచ్చరికలు ఏమిటని వైఎస్సార్‌సీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు టీడీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తుళ్లూరు సీఐ శ్రీకాంత్‌బాబును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము వ్యవహరిస్తున్నామన్నారు.
ఎవరి సూచన మేరకు ఈ ఆంక్షలు?
కృష్ణమ్మ గర్భాన్ని చీల్చుతున్న దొంగలను వదిలేసి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గు చేటు. మేము ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇన్నేళ్లలో ఎవరూ నదిలోకి వెళ్లొద్దని ఆంక్షలు విధించలేదు. టీడీపీ నాయకులకు పోలీసులు పరోక్షంగా అండగా నిలుస్తున్నారు. నదిలోకి వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పడమేంటి? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు. ఇంకా అధికార పార్టీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు.
– నందిగం సురేష్, వైఎస్సార్ సీపీ రాజధాని ప్రాంత లంక, అసైన్డ్ భూములు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్, తుళ్లూరు.
Comments
Please login to add a commentAdd a comment