ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలకుగాను నందిగామ అసెంబ్లీ, మెదక్ లోకసభ నియోజకవర్గాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలకుగాను నందిగామ అసెంబ్లీ, మెదక్ లోకసభ నియోజకవర్గాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో జూన్ 15 తేదిన టీడీపీ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకర రావు మృతి చెందడంతో ఖాళీ ఏర్పడింది. మేలో జరిగిన ఎన్నికల్లో రెండవసారి ప్రభాకర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అలాగే తొలి రోజున తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఉప ఎన్నికలకు నామినేషన్లకు చివరి గడువు ఆగస్టు 27 తేదికాగా, ఆగస్టు 28 తేది పరిశీలనకు చివరి తేది అని అధికారులు తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక సెప్టెంబర్ 13 తేదిన జరుగుతుందని, సెప్టెంబర్ 16 తేదిన కౌటింగ్ నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.