రుణ వసూలుకు నోటీసులివ్వద్దు
బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం
సాక్షి, కాకినాడ : మాఫీ వర్తించే రుణాల వసూలు కోసం రైతులను ఒత్తిడి చేయొద్దని, వారికి నోటీసులు జారీ చేయొద్దని కలెక్టర్ నీతూప్రసాద్ బ్యాంకర్లను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంపూర్ణ విత్తీయ సమావేశన్ (టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), ప్రధానమంత్రి జనధన్ యోజన అమలుపై కలెక్టరేట్ కోర్టు హాలులో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా ఎంతమంది రైతులు రుణమాఫీ పరిధిలోకి వస్తున్నారు.. వారికి రుణాల్లో ఎంత మేర మాఫీ కాబోతున్నాయి.. ఇంకా వారు ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనే వివరాల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రుణాలు చెల్లించినప్పటికీ రుణమాఫీ ఆగబోదని రైతులకు అవగాహన కల్పించాలే తప్ప వారిపై ఒత్తిడి తీసుకురావడం తగదని కలెక్టర్ పేర్కొన్నారు. తమ రుణాలను రెన్యూవల్ చేయించుకుంటే కొత్త రుణాలు పొందవచ్చునని రైతులకు సూచించాలని ఆమె చెప్పారు.
అక్టోబర్ 2లోగా అందరికీ బ్యాంకు ఖాతాలు
అక్టోబర్ 2లోగా ప్రధానమంత్రి జనధన్‌యోజన ద్వారా జిల్లాలో ప్రతి కుటుంబానికీ సున్నా నిలవతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్ర మాన్ని ఈనెల 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని చెరుకూరి ఫంక్షన్ హాలులో ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రధాన బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత, జన్‌ధన్ యోజన, ప్రత్యక్ష లబ్ధి బదిలీ అంశాలపై ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి స్టాళ్లను ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు.
వివిధ సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ప్రభుత్వ శాఖలు కూడా స్టాళ్లు ఏర్పాటు చేయాలని, ఆధార్ సీడింగ్ విధానంపైనా స్టాల్ ఉండేలా చూడాలని చెప్పారు. ప్రారంభోత్సవ వీక్షణకు భారీ ఎల్‌సీడీ ప్రొజెక్టర్లు, లైవ్‌టెలికాస్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతికుటుంబానికీ రెండు ఖాతాలు తెరిపించేందుకు ప్రత్యేక శిబిరాలు, బల్క్ అకౌంట్ ఓపెనింగ్ క్యాంపెయిన్ జిల్లా అంతటా ఈ నెల29న ప్రారంభించి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలకు ఖాతాలు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఖాతాలు పొందాల్సి ఉందనే వివరాలను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జేసీ ముత్యాలరాజు, ఐటీడీఎ పీఒ గంధం చంద్రుడు, ఎల్డీఎం ఎస్.జగన్నాధస్వామి, వివిధ బ్యాంకుల కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.