
రాజకీయాలకు అతీతంగా సమైక్య శంఖారావం
రాజకీయాలకు అతీతంగా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి తెలిపారు.
అనంతపురం:రాజకీయాలకు అతీతంగా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి తెలిపారు. సమైక్య పార్టీలకు మద్దతు ఇచ్చి..మిగిలిన పార్టీలపై ఒత్తిడి పెంచాలని ఆమో ప్రజలకు సూచించారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ సందర్భంగా ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు విభజనపై చేతులెత్తేశారని, ప్రస్తుతం మంత్రులు కొత్త రాజధానిని ఎక్కడ పెట్టాలన్న సంగతిపై లాబీయింగ్ చేస్తున్నారని తెలిపారు.
టీడీపీ నేతలకు దమ్ముంటే అధ్యక్షుడు చంద్రబాబుతో సమైక్యాంధ్ర అనిపించాలని శోభా నాగిరెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనపై ఇచ్చిన లేఖను చంద్రబాబు తక్షణమే వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వర్గం మీడియా అండతో టీడీపీ వైఎస్ జగన్మోహనరెడ్డిపై దుష్ర్పచారానికి దిగుతోందన్నారు.