అమరావతి: వంశధార నదిపై 20 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆర్థికంగా గిట్టుబాటు కాదని ఏపీ జెన్‌కో(విద్యుదుత్పత్తి సంస్థ) నిపుణుల బృందం తేల్చిచెప్పడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నదిపై 19.5 టీఎంసీల సామర్థ్యంతో హిరమండలం రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఆ రిజర్వాయర్ స్లూయిజ్‌ల ద్వారా గొట్టా బ్యారేజీ ఎడమ కాలువకు నీళ్లందిస్తారు.
రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు స్పిల్ వే ద్వారా గొట్టా బ్యారేజీకి దిగువన వంశధార నదిలోకి వరద నీటిని వదిలేస్తారు. రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 47.5 మీటర్ల వరకూ నీటిని వినియోగించుకోవచ్చు. అక్కడినుంచి గొట్టా బ్యారేజీకి అనుసంధానం చేస్తూ పెన్‌స్టాక్(గొట్టాల)ను ఏర్పాటు చేసి వాటికి 20 అడుగుల దిగువన టర్బైన్‌లను ఏర్పాటు చేసి రెండు వేల క్యూసెక్కుల నీరు విడుదల ద్వారా 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయాలంటే రిజర్వాయర్‌లో పవర్ బ్లాక్‌ను ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంటుంది.
పవర్ బ్లాక్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను జలవనరుల శాఖ ఈఎన్‌సీ(పరిపాలన) రవికుమార్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ గిరిధర్ రెడ్డి, సలహాదారు రౌతు సత్యనారాయణ బృందానికి అప్పగించింది. వారి నివేదికను జెన్‌కోకు పంపగా ఇటీవల రిజర్వాయర్‌ను పరిశీలించిన జెన్‌కో నిపుణుల బృందం పెన్ స్టాక్‌ల ద్వారా జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అధిక వ్యయం అవుతుందని, ఇది గిట్టుబాటు కాదని తేల్చిచెబుతూ సర్కార్‌కు మరో నివేదిక ఇచ్చింది. దీంతో జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి.
వంశధారపై విద్యుదుత్పత్తి ప్రాజెక్టు లేనట్లే
Published Fri, Apr 7 2017 8:07 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement