తెలంగాణ డిస్కంల ముందు హిందుజా సంశయం
మాకూ వాటా ఉందన్న టీ డిస్కంలు
ముసాయిదా పీపీఏ అందజేత
సాక్షి, హైదరాబాద్: తమ ప్లాంటులో ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ను తమకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంటోందని... వాటా మేరకు 53.89 శాతం విద్యుత్ మాకు ఇవ్వాలని మీరు అడుగుతున్నారని.. తాము ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదని తెలంగాణ ఇంధనశాఖ వర్గాల ముందు హిందుజా సంస్థ ప్రతినిధులు వాపోయినట్టు సమాచారం.
విశాఖ సమీపంలో 1,040 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును హిందుజా నిర్మిస్తోంది. ఈ ప్లాంటుతో ఉమ్మడి రాష్ట్రంలోనే గతేడాది మే 17న నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోఏ)ను కుదుర్చుకున్నాయి. ఇందుకనుగుణంగా తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకునేందుకు రావాలని హిందుజా సంస్థను తెలంగాణ డిస్కంలు (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) ఆహ్వానించాయి.
ఈ మేరకు సంస్థ వైస్‌ప్రెసిడెంట్ (కమర్షియల్) సిద్దార్థ దాస్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అభిషేక్ దాస్‌లు తెలంగాణ ఇందనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషితో పాటు ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీతో గురువారం సమావేశమయ్యారు. హిందుజా సంస్థ ప్రతినిధులకు ముసాయిదా పీపీఏను అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా హిందుజా ప్రతినిధులు తమ సందేహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అయితే, రెండు రాష్ట్రాల్లోని డిస్కంలకు ఏ వాటా మేరకు విద్యుత్ సరఫరా జరగాలన్న విషయంలో ఉమ్మడి రాష్ర్టంలోనే జీవో నం 20 జారీ అయిందని హిందుజా సంస్థ ప్రతినిధులకు తెలంగాణ అధికారులు సమాధానమిచ్చారు. సదరు జీవో కాపీని కూడా వారికి అందజేశారు. ముసాయిదా పీపీఏపై తమ న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం వారం రోజుల్లో తిరిగి వస్తామని హిందుజా ప్రతినిధులు తెలిపినట్టు ఇంధనశాఖ వర్గాలు వివరించాయి.
ఏపీ మొత్తం అంటోంది... మీరు వాటా అడుగుతున్నారు..?
Published Fri, Jul 25 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement