కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: విద్యార్థులు సైన్స్ పేరు వింటేనే వణికిపోతున్నారు. జిల్లాలోని 600 పైగా ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పరిజ్ఞానం లేకుండానే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. టెక్ట్స్‌బుక్స్‌లో ఫలానా అంశంపై విద్యార్థులకు ప్రయోగం ద్వారా వివరించాలని స్పష్టంగా పేర్కొన్నా.. 90 శాతం పాఠశాలల్లో ఆ పరిస్థితి కరువైంది. పాఠశాల నిర్వహణకు విడుదలయ్యే స్కూల్‌గ్రాంట్ నిధుల నుంచి ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉండగా.. చాలా పాఠశాలల్లో వాటి జోలికే వెళ్లడం లేదు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ప్రయోగశాలల ద్వారా సైన్స్ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించాల్సి ఉంది.
ప్రధానంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వారానికి నాలుగు చొప్పున జీవ, రసాయనశాస్త్రాల్లో ప్రయోగ శిక్షణ తరగతులు నిర్వహించాలి. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రమే అప్పుడప్పుడు పరికరాలను క్లాస్‌రూంలోకి తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ కింద 150 పాఠశాలల్లో ప్రయోగశాలల ఏర్పాటుకు 150 గదులు నిర్మించగా.. వీటిని తరగతి గదులుగా ఉపయోగించుకుంటూ ప్రయోగ పరికరాలను బీరువాలకు పరిమితం చేశారు. ప్రయోగశాలల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం, నిర్వహణ విషయంలో విద్యాశాఖాధికారులు శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య అందని పరిస్థిథి నెలకొంది. గతంలో ప్రభుత్వం ఆయిల్ చార్ట్‌లను పంపేది. ప్రస్తుతం బడ్జెట్‌ను కేటాయించి చేతులు దులుపుకుంటుండటంతో ఉపాధ్యాయులు స్థానికంగా దొరికే నాణ్యతలేని చార్ట్‌లతో సరిపెడుతున్నారు.
గాలిలో ధ్వని వేగం కనుక్కోవడం, ఎలక్ట్రికల్, మోటార్స్‌కు సంబంధించిన కొన్నింటిపై మాత్రమే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. హీట్, మెల్ట్ చేయాలంటే గ్యాస్ తప్పనిసరి. కానీ గ్యాస్ సిస్టమ్‌ను హైస్కూల్స్‌లో ఏర్పాటు చేయకపోవడంతో రసాయనాల ద్వారా రంగుల మార్పుతో పాటు ఇతర ప్రయోగాలేవీ విద్యార్థులకు తెలుసుకునే వీలు లేకపోతోంది. మైక్రోస్కోప్‌లు, స్ప్రింగ్ త్రాసులు వంటివి పని చేయడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైస్కూళ్లలో విద్యార్థులు టెస్టు పుస్తకాలతో కుస్తీ పడటమే తప్పిస్తే ప్రయోగాలతో అవగాహన పెంపొందించుకునే భాగ్యానికి దూరమవుతున్నారు. భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాల్లో మారిన పాఠ్యాంశాల మేరకు కొత్త ప్రయోగ పరికరాలు లేకపోవడంతో పాత పాఠ్యాంశాల్లోని పరికరాలతోనే ప్రయోగ విద్యను ఉపాధ్యాయులు తూతూమంత్రంగా బోధిస్తున్నారు.
కర్నూలు నగరంలో తొమ్మిది మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ఉండగా ఎక్కడా ప్రయోగాలు చేయిస్తున్న దాఖలాల్లేవు. ఉపాధ్యాయులు అప్పుడప్పుడు పరికరాలను చేతబట్టుకుని చూపడంతో సరిపెడుతున్నారు. బండిమెట్ట పాఠశాలలో గదుల కొరతతో పరికరాలను అటకెక్కించారు.
డోన్‌లోని నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో ఎక్కడా ల్యాబ్ సౌకర్యమే లేదు. ఈ కారణంగా ప్రయోగ పరికరాలను బీరువాలకే పరిమితం చేశారు.
గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలకు కేటాయించిన గదిని మధ్యాహ్న భోజన నిర్వహణకు అప్పగించారు.
ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, క్రిష్ణాపురం, ఓబుళంపల్లె పాఠశాలలో ప్రయోగ పరికరం ఊసే కరువైంది. ఆలమూరు, యల్లావత్తుల పాఠశాలల్లో పరికరాలు తుప్పు పట్టడడంతో బీరువాలో భద్రపరిచారు.
కోవెలకుంట్లలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో గదులున్నా ప్రయోగ పరికరాలకు టేబుళ్లు లేని కారణంగా నిరుపయోగమయ్యాయి.
ప్ర‘యోగం’ లేదు!
Published Wed, Dec 11 2013 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement