బదిలీలపై బదులేదీ! | No response on transfers | Sakshi
Sakshi News home page

బదిలీలపై బదులేదీ!

Published Mon, Nov 18 2013 12:20 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM

No response on transfers

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  విద్యాశాఖలో ‘స్థానిక’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో స్థానికేతర ఉపాధ్యాయుల వివరాలు తేల్చాలంటూ రాష్ట్ర విద్యాశాఖ జిల్లా విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు  జారీ చేసింది. ఇందులో 2001కి ముందువరకు నిర్వహించిన డీఎస్సీల్లో స్థానిక, స్థానికేతర అభ్యర్థులు 70:30 చొప్పున పరిగణనలోకి తీసుకోవాలని, 2001 తర్వాత నిర్వహించిన డీఎస్సీల్లో ఈ నిష్పత్తి 80:20 చొప్పున గణిస్తూ.. ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో స్థానికేతర అభ్యర్థుల లెక్క తేల్చాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులతో నేరుగా జిల్లాకు వచ్చిన వారి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో వారిని ఏ కేటగిరీలో చూపించాలో విద్యాశాఖకు అర్థం కాని పరిస్థితి తలెత్తింది.
 అలా చూపించి.. ఇలా చొచ్చుకువచ్చి  
 రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వందల సంఖ్యలో అంతర్ జిల్లా టీచర్లు బదిలీపై వచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో స్థానిక సంస్థల పాఠశాలలు లేకపోవడంతో ఆ జిల్లాకు బదిలీపై వచ్చిన పలువురు టీచర్లు కూడా జిల్లాలో నియమితులయ్యారు. అంతర్‌జిల్లా బదిలీ ప్రక్రియలో కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ బదిలీ తాకిడి విపరీతంగా పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 400 మందికిపైగా.. ప్రభుత్వ ఉత్తర్వులతో వచ్చిన వారున్నారని విద్యాశాఖ అధికారుల ప్రాథమిక అంచనా. కానీ విద్యాశాఖ అధికారులు ఇలా వచ్చినవారి వివరాలను ఇప్పటివరకు రికార్డు చేయలేదు.
 ఆ లెక్కలు అంత సులువేం కాదు
 జిల్లాలో స్థానికేతర టీచర్లు వెయ్యి మంది వరకు ఉంటారని విద్యాశాఖ ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే డీఎస్సీల వారీగా పరిశీలిస్తే కచ్చితమైన వివరాలు వెలుగు చూస్తాయి. కానీ అంతర్ జిల్లాల నుంచి బదిలీపై వచ్చినవారి లెక్క తేల్చడం  అంత సులువైన విషయం కాదని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో ఏకంగా 400 మందికిపైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉత్తర్వులతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా టీచర్ల వివరాలు నియామకాల జాబితాల్లో నమోదు కావు. దీంతో వారి వివరాలు తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిందే. ప్రస్తుతం జిల్లాలో 12వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లున్నారు. డీఎస్సీల వారీగా కాకుండా సర్వీసు పుస్తకాల ఆధారంగా పరిశీలిస్తేనే స్పష్టత వస్తుందని, ఇది సుదీర్ఘ ప్రక్రియని అధికారులు చెబుతున్నారు.
 డీఎస్సీల వారీగా పరిశీలిస్తాం: సోమిరెడ్డి, డీఈఓ
 ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం డీఎస్సీల వారీగా స్థానిక, స్థానికేతర టీచర్ల వివరాలు పరిశీలిస్తాం. ఇందుకు సంబంధించి ప్రత్యేక నివేదిక తయారు చేస్తాం. ప్రత్యేక ఉత్తర్వులతో జిల్లాకు బదిలీపై వచ్చిన అంతర్‌జిల్లా టీచర్ల అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement