కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఈసారి సంక్రాంతి ముంగిట్లోకి వచ్చేసినా పలు ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఇళ్లలో ఆ కళాకాంతులు కనిపించ డం లేదు. నెలల తరబడి జీతాల్లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. పప్పన్నం, పరమాన్నా లు కాదు కదా.. కనీసం సాధారణ భోజనమైనా చేయగలమా అనే దీనస్థితిలో ఉన్న ఈ కుటుంబాలు పండుగ రాకపోతే బాగుణ్ను అని భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వీరంతా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు కావడం.. వీరికి నెలనెలా సక్రమంగా వేతనాలు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యంతో వీరి జీవితాలు కళ తప్పాయి. ఊరం తా పండుగ సంబరాల్లో మునిగితేలితే.. ఈ కుటుంబాలు మాత్రం ఉసూరుమంటూ ఇళ్లలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్‌పీఎం: ఈ విభాగంలో సీఏలు 93 మంది, వీఏలు 118 మంది ఉన్నారు. సీఏలకు నెలకు రూ. 4 వేలు, వీఏలకు రూ. వెయ్యి గౌరవవేతనంగా ఇస్తారు. ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వీరి కుటుం బాల మనుగడే కష్టంగా మారింది. కాంట్రాక్టు లెక్చరర్లు: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 52 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.18 వేల వేతనం అందజేయాలి. గత ఏడు నెలలుగా
జీతాలు విడుదల కాలేదు.
పురపాలక సంఘం: పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, పలు ఇతర క్యాడర్లలో 100 మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్యాడర్‌ను బట్టి వీరికి రూ. 6 వేలు నుంచి రూ. 10 వేల వరకు జీతాలు చెల్లించాలి. నాలుగు నెలలుగా జీతాలు విడుదల కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రిమ్స్ ఆస్పత్రి: జిల్లా పెద్దాస్పత్రి అయిన రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 180 మంది వరకు పని చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీ, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, డాటా ఎంట్రీ ఆపరేటర్ తదితర కేడర్లలో పని చేస్తున్న వీరికి రూ. ఆరు నుంచి పదివేలు వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. అయితే గత నాలుగు నెలలుగా వీరికి జీతాలు ఇవ్వలేదు. ఇక రిమ్స్‌లో పారిశుద్ధ్య కార్యకర్తల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమకు జీతాలు చెల్లించేదెవరో కూడా తెలియని పరిస్థితుల్లో వీరున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ: వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆర్‌సీహెచ్ -3 కాంట్రాక్టు ఎఎన్‌ఎంలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారుగా 350 మంది ఉంటారు. వీరికి గత మూడు నెలలుగా జీతాలు లేవు. వీరికి క్యాడర్‌ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 15వేల వరకు నెలనెలా జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. అలాగే నిరంతరం అత్యవసర సేవలు అందించే 104 విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆరు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు.
రెవెన్యూ విభాగం: జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలో కలెక్టరేట్‌తోపాటు వివిధ తహశీల్దార్ కార్యాలయాల్లో కాంట్రాక్టు విధానంలో అటెండర్లు, డాటాఎంట్రీ ఆపరేటర్లుగా 90 మంది వరకూ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ. 10 వేల వరకు జీతంగా చెల్లించాల్సి ఉండగా నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు. సంక్షేమశాఖ: సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సుమారు 120 మంది అటెండర్లు, వంటపనివారికి నెలకు రూ.6వేలు చొప్పున జీతాలు ఇవ్వాలి. అయితే నాలుగు నెలలుగా జీతాలు అందడం లేవు.
జీతమో.. రామచంద్రా!
Published Tue, Jan 14 2014 1:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement