శ్రీకాకుళం పాతబస్టాండ్:ఉత్తమ సేవలందించినందుకు ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసాపత్రాలకు రానురాను విలువ లేకుండాపోతోంది. ఉత్తమ సేవకుల జాబితా ఏటా పెరిగిపోతుండటం, అందుకున్నవారే మళ్లీ మళ్లీ అందుకోవడంతో వీటి ప్రాధాన్యత పలుచబడిపోతోంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టర్ హెచ్చరించిన సిఫారసుల సంఖ్య తగ్గడం లేదు. ప్రతి ఏటా 350 నుంచి 400 మంది వరకు ఉత్తమ అవార్డులు అందుకుంటున్నా వాస్తవంగా కొన్ని శాఖల్లో మంచి సేవలు అం దించిన వారి పేర్లు ఈ జాబితాల్లో కనిపిం చడం లేదు.
అదే సమయంలో మరికొన్ని శాఖల్లో కొందరి పేర్లే మళ్లీ మళ్లీ అవార్డు జాబితాలో చేరుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15న జిల్లాలో 366 మందికి అవార్డులు అందజేశారు. వీరితోపాటు స్వచ్ఛంద సంస్థ లు ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రత్యేక విభాగాల వారికి సన్మానం చేశారు. కాగా ఈ ఏడాది 200 మందికి మించి అవార్డులు ఇవ్వకూడదని, ప్రతి శాఖ నుంచి ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది పేర్లు సిఫార్సు చేయరాదని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఈనెల రెండో తేదీన జరిగిన సమావేశంలో అధికారులకు గట్టిగా హెచ్చరించారు.
అయినా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పటికే 85 ప్రభుత్వ విభాగాల నుంచి 279 పేర్లను అవార్డులకు సిఫార్సు చేస్తూ ఆయా శాఖల అధికారులు జాబితాలు అందజేశారు. ఇవే కాకుండా 7 స్వచ్ఛంద సంస్థలకు చెందిన 12 మంది దర ఖాస్తు చేసుకున్నారు. మరో మూడు, నాలుగు శాఖల నుంచి అందాల్సి ఉంది. వీరితోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రత్యేక రంగాల్లో నిష్ణాతులు అవార్డుల జాబితాలో ఉంటారు. ఇవన్నీ కలిపి ఈ ఏడాది కూడా ఉత్తమ సేవకుల సంఖ్య 350 వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తముల జాబితా చాంతాడంత!
Published Wed, Aug 13 2014 2:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement