ఓ బాలిక భవిష్యత్‌తో రాజకీయ క్రీడ!
Published Fri, Aug 16 2013 4:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
జలుమూరు, న్యూస్‌లైన్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు గడిచినా ఇంకా ఏదో ఒక మూల బాలికల హక్కులకు భంగం వాటిల్లుతూనే ఉంది. క్షుద్ర, స్వార్ధ రాజకీయాలకు వారు బలవుతూ నే ఉన్నారు. జలుమూరు మండలం బొడ్డపాడులో గురువారం జరిగిన సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ. బొడ్డపాడుకు చెందిన ఓ బాలిక, యువకుడు కొనేటి మంగయ్యస్వామి కుటుం బాలు ఊరి చెరువు గట్టుపై పాకలు వేసుకొని నివాసం ఉంటున్నాయి. కులాలు వేరైనప్పటికీ ఇరుగు పొరుగు కావడంతో ఈ కుటుంబాల మధ్య పరిచయం ఉంది. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంగయ్యస్వామి కుటుంబ సభ్యులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చా రు. ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్‌గా గెలుపొందారు. దీంతో తమకు ఓటు వేయనివారిపై కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పెద్దలు తెగబడ్డారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న బాలిక తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులను పావుగా వాడుకొని మంగయ్యస్వామి కుటుంబంపై కక్ష తీర్చుకోవాలనుకున్నారు. మంగయ్యస్వామితో ఆ బాలిక సన్నిహితంగా ఉంటున్నదని, వారిద్దరికీ పెళ్లి చేయాలని కాంగ్రెస్ పెద్దలు బాలిక తరఫువారిని ప్రలోభాలకు గురిచేసి ఒప్పించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మంగయ్య స్వామి ఇంటికి ఆ బాలికను కాంగ్రెస్ పెద్దలు తీసుకువచ్చారు. ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉండాలని చెప్పి ఒక గదిలో నిర్బంధించి వెళ్లారు. అర్ధరాత్రి బాలికను వదిలివెళ్లడంతో మంగయ్యస్వామి కుటుంబం షాక్‌కు గురైంది. మైనర్ ను వేళకాని వేళలో ఇంట్లో ఉంచుకుంటే ఏ అనర్థం చుట్టుకుంటుందోనని హడలిపోయారు. గురువారం ఉదయం మంగయ్యస్వామి, ఆమె తల్లి కలిసి జరిగినదానిని వివరిస్తూ జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి వచ్చిన పోలీసులు కూడా పెద్దల తీర్పు వినాల్సిందేనని మంగయ్యస్వామి కుటుంబాన్ని బెదిరించారు.
కిడ్నాప్ కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో మంగయ్యస్వామి తరపువారు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా బాధిత బాలిక చైల్డ్‌లైన్ 1098కు ఫోన్ చేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో అక్కడికి చేరుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది పోలీసులతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం నరసన్నపేట సీఐ వద్దకు బాలిక ను తీసుకువెళ్లారు. బాలికను శిశు సంక్షేమ హాస్టల్‌లో ఉంచి రక్షణ కల్పించాలని సీఐ ఆదేశించారు.
కక్ష సాధించేందుకే: మంగయ్యస్వామి
ఆ బాలికతో పరిచయం తప్ప ఎలాంటి సంబంధం లేదని మంగయ్యస్వామి చెప్పా డు. అయినప్పటికీ ఇంత గొడవ జరిగి వీధినపడ్డాం కాబట్టి బాలిక ఇష్టపడితే మైనారిటీ తీరాక పెళ్ళిచేసుకుంటానని తెలిపాడు. అప్పటివరకు బాలికను వాళ్ల ఇంటివద్దే ఉంచాలని కోరాడు. కక్ష సాధించేందుకే గ్రామపెద్దలు ఇలా చేశారని చెప్పాడు.
మైనర్‌నన్నా పెళ్లి చేసుకోవాలంటున్నారు: బాధితురాలు
మంగయ్యస్వామి తనకు స్నేహితుడు మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ఇతర సంబంధాలు లేవని బాధితురాలు చెప్పింది. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఇలా ఎందుకు చేశారో తెలియదని పేర్కొంది. ఎందరో మైనర్లకు వివాహాలు జరిగాయి.. నీకేమీ కాకుండా చూసుకుంటామని ఊరిపెద్దలు, పోలీసులు చెబుతున్నారని వివరించింది. తన వయసు 16 ఏళ్లేనని చెప్పినా వినడం లేదని వాపోయింది. మంగయ్యస్వామి ఇష్టపడితే మైనారిటీ తీరాక పెళ్లిచేసుకుంటానని చెప్పింది. ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకూ రాకూడదని వాపోయింది.
Advertisement