ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్‌కుమార్
సమ్మక్క-సారలమ్మ జారతకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని, జాతరలో నిరంతరం తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ వై.సురేష్‌కుమార్ తెలిపారు. కోటిమంది వస్తారన్న అంచనాతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. చిలకలగుట్ట, శివరాంసాగర్, కన్నెపల్లి, కొత్తూరు, చింతల్, ఊరట్టం, నార్లాపూర్, జంపన్నవాగు బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో భక్తులు ఎక్కువగా బస చేసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జాతర సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
జాతరకొచ్చే భక్తులు నీటికోసం టెన్షన్ పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. నల్లాలకు, మరుగుదొడ్ల వద్ద ఉన్న నీటి టబ్‌లకు నిరంతరం నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జంపన్నవాగులో 9ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఉండగా మరో రెండు కొత్తవి నిర్మిస్తున్నాం. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద కొత్తగా 52 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తున్నాం. ఏర్పాటు చేసిన వాటికి ఇప్పటికే ట్రయల్న్ ్రనిర్వహించాం. భక్తుల తాగునీరు ఇబ్బందులు తీర్చేందుకు గతంలో ఉన్న 260కి అదనంగా మరో 63 నల్లాలు ఏర్పాటు చేస్తున్నాం.
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు నీటి సరఫరా కోసం 58గొట్టపు బావులతోపాటు మరో 20 కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచి 5హెచ్‌పీ పంపులతో నీరు అందిస్తాం. ఎక్కడైనా నీరు లభించేలా జాతీయ రహదారితోపాటు పస్రా-నార్లాపూర్-మేడారం వరకు చేతిపంపులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గతంలో 236 చేతిపంపులు ఉండగా ఈసారి మరో 45 కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాక ఎక్కడైనా ఇబ్బందు లు తలెత్తి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా 50 ట్యాంకర్లను జాతర పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నాం.
మరుగుదొడ్ల నిర్మాణం
గత జాతరలో 8800 మరుగుదొడ్లు ఏర్పాటు చేయ గా ఈసారి వాటి సంఖ్యను పదివేలకు పెంచాం. జాతీయ రహదారి వెంట ప్రతీ గ్రామ శివారులో మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. ఆర్టీసీ బస్టాండ్, అలైటింగ్ పాయింట్, స్నానఘట్టాలు, పోలీస్ క్యాంపు, ఇంగ్లిషు మీడియం స్కూల్, హెలీప్యాడ్ తదితర ప్రాంతాల్లో పక్కా మరుగుదొడ్లు నిర్మించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. వీటికి నిరంతరం నీటి సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా పైపులైన్లు నిర్మిస్తున్నాం. నిర్మించిన టాయిలెట్లను గుర్తించేందుకు ఈసారి జీపీఎస్ ద్వారా కోఆర్డినేట్స్(అక్షాంశాలు-రేఖాంశాలు ప్రకారం) గుర్తించి రికార్డు చేస్తున్నాం. ఈ వివరాలన్నీ అన్‌లైన్‌లో పెడుతున్నాం.
ఆరు క్లస్టర్లుగా జాతర ప్రాంతం
జాతర జరిగే ప్రాంతాలను ఆరు క్లస్టర్లుగా విభజించాం. ప్రతీ క్లస్టర్‌ను ఒక డీఈ పర్యవేక్షిస్తారు. ఆయన పరిధిలో ముగ్గురు ఏఈలు, ఒక పంపు మెకానిక్, ఒక ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఉంటారు. గతంలో తాగునీటికి, శానిటేషన్ పనులకు వేర్వేరుగా అధికారులు ఉండేవారు. ఈసారి ఈ రెండు విభాగాలను ఒకే అధికారి పర్యవేక్షిస్తారు. అలాగే జాతర జరిగే వారం రోజులపాటు ప్రత్యేకంగా ఓ మొబైల్ టీంను ఏర్పాటు చేస్తున్నాం.
ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
మేడారంలో ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బస్టాండ్, అలైటింగ్ పాయింట్ ప్రాంతాల్లో రూ.15లక్షల వ్యయంతో 20వేల సామర్థ్యం కలిగిన రెండు గ్రౌండ్ లెవల్ స్టోరేజీ రిజర్వాయర్లు(జీఎల్‌ఎస్‌ఆర్) నిర్మించి వాటిచుట్టూ నల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదే ప్రాంతంలో స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు కూడా నిర్మిస్తున్నాం. వీటి నిర్వహణకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తున్నాం.
నిరంతరం పరీక్షలు, పర్యవేక్షణ
సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్ కలుపుతాం. మరుగుదొడ్లకు ఉపయోగించే నీటిలోనూ క్లోరిన్ కలుపుతాం. క్లోరిన్ శాతాన్ని ప్రతి గంటకు పరీక్షించేందుకు సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నాం. ఇతర జిల్లాల్లోని వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌లలో పనిచేస్తున్న 150మంది టెక్నీషియన్ల సేవలను జాతరలో వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జాతర పనులన్నీ హన్మకొండ ఈఈ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జాతర గురించి వినడమే తప్ప ఎన్నడూ చూడలేదు. ఈసారి జాతరలో సేవ చేసే అదృష్టం దొరికినందుకు ఆనందంగా ఉంది.
నీటికి నో టెన్షన్
Published Fri, Jan 24 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement
Advertisement