రాబోయే ఎన్నికల్లో మంచివ్యక్తిని ఎన్నుకోండి
కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'రచ్చబండ' కార్యక్రమాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వృద్ధుల కోసం కేటాయించిన రూ.9కోట్లు ఫించన్లు వారికి చేరలేదన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోందని డీఎల్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
మరోవైపు పలు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం అభాసుపాలవుతోంది. అధికార పార్టీ నేతలతో, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అభివృద్దిపై కొందరు, సమైక్యాంధ్రపై మరికొందరు నిలదీస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తిరుపతి ఎంపీ చింతామోహన్, సత్యవేడు ఎమ్మెల్యే హేమలతను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. పదవులకు పార్టీకి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సమైక్యవాదులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం రచ్చబండలో పాల్గొనేందుకు వచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చారంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే పులపర్తి అసహనం వ్యక్తం చేస్తూ స్టేజీ దిగి వెళ్లిపోయారు. మరోవైపు కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో ముఖ్యమంత్రి కిరణ్ నివేదిక ప్రసంగాన్ని చదవకుండానే మంత్రి శ్రీధర్‌బాబు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.