రాయదుర్గం, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 25 నుంచి ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారని, విభజనకు కారణమైన చంద్రబాబు రాజకీయానికి సీమాంధ్రలో ఇది అంతిమ యాత్ర అవుతుందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయదుర్గంలో కాపు భారతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరం, విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడారు. వీహెచ్ హనుమంతరావుకు తిరుపతిలో పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందని హెచ్చరించారు.
విభజన కోసం ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును నిలదీయకుండా ఆ పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిగ్గు, మానవత్వం ఉంటే చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
ఆత్మ గౌరవ కాదు.. టీడీపీకి అంతిమ యాత్ర
Published Fri, Aug 23 2013 5:09 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement