ఫోన్ ట్యాప్పై రోజూ మాటలెందుకు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులపై ప్రతి రోజూ మాట్లాడాల్సిన పనిలేదని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఏపీ వ్యవసాయశాఖా మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు రాజీపడిపోయారన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నానని, ఈ విషయంలో వెనుకకు తగ్గేది లేదని చెప్పారు. రాష్ట్రం కోసం చంద్రబాబు బస్సులోనే ఉంటానని చెప్పారని అన్నారు. బస్సు ఎక్కుగానే నిద్ర పడుతుందని.. దానిపై కూడా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
వేరు శెనగ విత్తనాలు పక్క రాష్ట్రంలో కొందామన్న ఎవరూ ముందుకు రాలేదని ఆయన చెప్పారు. గతేడాది పంట దిగుమతి లేకపోవడం వల్ల ఈసారి విత్తనాల డిమాండ్ పెరిగిందని చెప్పారు. రైతులు బయటకొన్నా సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రుణమాఫీపై ఆరు లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని ఇక నుంచి ఫిర్యాదులు తీసుకోబోమని స్పష్టం చేశారు. రుణమాఫీకి సుమారుగా మరో 2.50 లక్షల వరకు అర్హత వచ్చే అవకాశం ఉందని ప్రత్తిపాటి తెలిపారు.