తమ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిన స్థాయిలో ఆధారాలున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
తమ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిన స్థాయిలో ఆధారాలున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు నాయుడితో మంత్రుల సమావేశం అయిన అనంతరం ఆయన మరో మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
''టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది. ఏసీబీకి నోటీసులు జారీచేసే అధికారం లేదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పుడు, ఎన్నికల ప్రక్రియ ఉన్నందువల్ల అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎలాంటి చర్య విషయంలోనైనా ఈసీ జోక్యం చేసుకోవాలి. ఏసీబీ కేవలం ఉద్యోగుల అవినీతిని అరికట్టడానికే ఏర్పాటైంది. ఈసీ మాత్రమే ఇలాంటి సందర్భంలో రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏసీబీతో నోటీసులు ఇప్పిస్తున్నామంటూ లీకులిస్తున్నారు. ఏసీబీకి నోటీసులిచ్చే అధికారంలేదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సంభాషణలు అంటున్నారు.. అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గానీ, ఏసీబీ అధికారులు గానీ ఈ నిమిషం వరకు చెప్పలేకపోతున్నారు. నోటీసులు ఇవ్వబోతున్నారు, సీఎం రాజీనామా చేస్తారు, అశోక్ సీఎం అవుతారు అంటూ తప్పుడు వార్త పంపిస్తున్నారు.
తాటాకు చప్పుళ్లకు మేం భయపడేది లేదు. కేసీఆర్ మీద ఏపీలో నమోదైన 87 కేసులపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణ జరపబోతోంది. మత్తయ్యను బెదిరించడంపై సీబీసీఐడీ విచారణ జరపబోతోంది. ఫోన్ ట్యాపింగ్కు మా వద్ద పక్కా ఆధారాలున్నాయి. మేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మా దగ్గర తెలంగాణ ప్రభుత్వం కూలిపోయే ఆధారాలున్నాయి. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఏమయ్యారో ఒక్కసారి చూడండి. పెట్టుకునేవాళ్లకు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు ఒక అడుగు మీరు ముందుకేస్తే ఏపీ ప్రభుత్వం రెండు అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరికీ అధికారాలున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, రాజీనామా అక్కర్లేదు, ఏపీ ప్రజలు కూడా భయపడక్కర్లేదు''