జిల్లాలోని రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. జిల్లాలోని 53 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 83 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పోస్టులు భర్తీ కానున్నాయి.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. జిల్లాలోని 53 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 83 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం డీఆర్వో రాజు, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ 18 ఏళ్లకుపైబడి 35 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వీఆర్వోలకు రూ.7,520 నుంచి రూ.22,430 వరకు వేతనం ఉంటుంది.
వీఆర్వోలకు దరఖాస్తులు చేసుకునే వారు ఇంటర్ విద్యార్హత ఉందన్నారు. పరీక్ష ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీలకు రూ.150 మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. వీఆర్వోలకు 2014 జనవరి 12 వరకు దరఖాస్తులకు చివరి తేదని తెలిపారు. వీఆర్వోలకు ఫిబ్రవరి 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. అబ్జెక్టివ్ రూపంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు.
శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో, మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వీఆర్‌ఏలకు జనవరి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీఆర్‌ఏలకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వీఆర్‌ఏలకు దరఖాస్తులు చేసుకునేవాళ్లు ఖచ్చితంగా ఆ గ్రామస్థులై ఉండాలని, లేనియేడల తిరస్కరించడం జరుగుతుందని తెలిపారు.