తమ సమస్యను డీఎస్పీకి వివరిస్తున్న విద్యార్థులు
జంగారెడ్డిగూడెం రూరల్ : తమకు న్యాయం చేయాలంటూ మండలంలోని వేగవరం నోవా కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణకు విన్నవించుకున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని, దీని వల్ల తాము ఏడాది చదువు నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్ధులు డీఎస్పీకి వివరించారు. డిగ్రీలో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తాము ప్రాక్టీకల్స్‌లో ఫెయిల్ కావడం ఏమిటని కావాలనే తమను ఫెయిల్ చేశారంటూ డీఎస్పీ వద్ద విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు జరిగిన అన్యాయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా పీజీ కోర్సులో చేర్చేలా చూస్తామని హామీ ఇచ్చారని డీఎస్పీకి వివరించారు. దీంతో నెల రోజుల పాటు తాము కళాశాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో మిమ్మల్ని ఆశ్రయించాల్సి వచ్చిందని డీఎస్పీ వద్ద వాపోయారు. విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారని తెలుసుకుని కళాశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నచ్చజెప్పె ప్రయత్నాలు చేశారు. దీనిపై కళాశాల సిబ్బంది మాట్లాడుతూ ప్రాక్టికల్ మార్కులు యూనివర్సిటీ పరిధిలో ఇస్తారని, తమ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, యూనివర్సిటీకి ఫిర్యాదు చేసి న్యాయం చేస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment